ఏపీలో రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసన కాస్త ఉద్రిక్తంగా మారింది. మూడో రోజు అసెంబ్లీ సందర్భంగా వారు ఎద్దుల బండ్లతో నిరసన తెలిపారు. ఎద్దుల బండ్లపై అసెంబ్లీకి వెళ్లాలని టీడీపీ ఎమ్మెల్యేలు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఎద్దుల బండ్ల టైర్లలో గాలి తీసేశారు. ఎద్దులను అక్కడి నుంచి ఓ కిలో మీటరు దూరం తోలేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ ఎమ్మెల్యేలు తుళ్లూరు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేశారు.






ఎద్దులు లేకపోవడంతో మందడం ఊరి నుంచి ఖాళీ ఎద్దుల బండ్లతో నిరసన తెలిపారు. టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, నారాలోకేశ్ తో ఎమ్మె్ల్యేలు, ఇతర ఎమ్మెల్సీలు ఎడ్ల బండి కాడె మోసుకుంటూ లాక్కొని వెళ్లారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ రైతు ద్రోహి అంటూ నినాదాలు చేశారు. పంటలకు గిట్టుబాటు ధర ఎక్కడ?, జగన్‌ పాలనలో క్రాప్‌ హాలిడే అమలు అవుతోంది. లాంటి నినాదాలు చేశారు. ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. మధ్యలో రోడ్డుపై పోలీసులు వలయంగా ఏర్పడి ఆపే ప్రయత్నం చేయగా, వారిని దాటుకొని అసెంబ్లీ వరకూ వెళ్లగలిగారు. 


ఈ సందర్భంగా టీడీపీ నిరసన తెలిపినందుకు ఎద్దులను, బండ్లను ఇచ్చిన రైతును తుళ్లూరు సీఐ తీవ్రంగా కొట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రైతుపై చేయిచేసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలపైన అసెంబ్లీలోనూ తమ నిరసన తెలుపుతామని అన్నారు. అయితే, నేటి (సెప్టెంబరు 19) అసెంబ్లీలో రైతులు సమస్యలపై చర్చ జరపాలని టీడీపీ నేతలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.


మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు రైతుల నిరసన సెగ
మరోవైపు, నేడు ఉదయం ఏపీ సచివాలయం వద్ద రైతులు కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సచివాలయం సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ గోడ దూకి ఒక్కసారిగా అసెంబ్లీ ముట్టడికి రైతులు ప్రయత్నించారు. రైతు ఆందోళనతో అసెంబ్లీ - సచివాలయం మార్గంలో ట్రాఫిక్ బాగా ఆగిపోయింది. దీంతో ఆ ట్రాఫిక్ లోనే పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలు ఉండిపోయాయి. పోలీసులు రైతుల్ని అరెస్టు చేసి తీసుకెళ్లి ట్రాఫిక్ క్లియర్ చేసే వరకూ అసెంబ్లీకి వెళ్లే మార్గం లేకుండా పోయింది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రోడ్డు నుంచి ఈడ్చుకు వెళ్లి రైతులను కారు, ఆటోలలో రైతులను పోలీసులు తరలించారు.