Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాసేపట్లో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను సభ ముందు ఉంచనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలతోపాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేయడమే ధ్యేయంగా ఈ బడ్జెట్‌ను ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఆయన ప్రసంగం తర్వాత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సుమారు రూ.2.90 లక్షల కోట్లతో సిద్ధం చేసిన బడ్జెట్‌ను సభ ముందు ఉంచుతారు. శాసనమండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను చదివి వినిపిస్తారు. వ్యవసాయ బడ్జెట్‌ను అచ్చెన్న ప్రవేశ పెట్టనున్నారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ చదువుతారు.
గవర్నర్ ప్రసంగం, తర్వాత బడ్జెట్ ప్రసంగం పూర్తి అయిన తర్వాత సభ వాయిదా వేస్తారు. అనంతరం బీఏసీ సమావేశం అవుతుంది. సభ ఎన్ని రోజులు నడపాలి ఏ ఏ అంశాలపై చర్చించాలనేది నిర్ణయిస్తుంది. దాదాపు పది రోజులపాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశాలకి కూడా వైసీపీ డుమ్మాకొట్టాలని నిర్ణయించింది.
సార్వత్రిక ఎన్నికల ముందు మొదటి సారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థాయిలో అస్తవ్యస్థం చేసిందని అందుకే పూర్తి స్థాయి అవగాహన వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతామని కూటమి ప్రభుత్వం చెప్పి మరోసారి ఓటాన్ అకౌంటర్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఇన్నాళ్లకు ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్‌ను సభక ముందుకు తీసుకొస్తోంది.
ప్రస్తుతం ప్రవేశ పెట్టే బడ్జెట్ కేవలం నాలుగు నెలలకే పరిమితం అవుతుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఇతర ఆలోచనలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో 2025-26 బడ్జెట్‌లో వివరిస్తుందని అంటున్నారు. నాలుగు నెలలకే బడ్జెట్ ప్రవేశ పెడుతున్నప్పటికీ ఈ కింది అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబోతోందని సమాచారం.
ఈసారి బడ్జెట్‌లో ప్రధాన్యత ఇచ్చే అంశాలు
- రోడ్ల మరమ్మతులు
- రాజధాని పనులకు కేటాయింపులు
- పోలవరంతోపాటు ఇతర ప్రాజెక్టులకు నిధులు
- విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు ప్రధాన్యం
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తగిన నిధులు
సభకు వైసీపీ డుమ్మా
తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన వైసీపీ అధినేత జగన్ రోజూ మీడియా సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. అసెంబ్లీలో జరిగే చర్చలపై మీడియా సమావేశం పెట్టి వాటిని ప్రశ్నిస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇవాళ్టి నుంచి రోజూో గంటపాటు మీడియాతో మాట్లాడనున్నారు. బడ్జెట్‌తోపాటు సభలో జరిగే చర్చలన్నింటిపై మాట్లాడతామన్నారు. ఈ ఉదయం పదిన్నరకు వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమవుతారు.
9 గంటలకు కేబినెట్
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ 9 గంటలకు సమావేశం కానుంది. ఇప్పటికే అధికారుల నుంచి బడ్జెట్ ప్రతులు అందుకున్న పయ్యావుల కేశవ్ వాటిని కేబినెట్ ముందు పెట్టనున్నారు. సాధారణ బడ్జెట్‌తోపాటు వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రిమండలి ముందు ఉంచి వారి ఆమోదం తీసుకుంటారు. అనంతరం సభలో ప్రవేశ పెడతారు.