AP Weather Updates | అమరావతి: దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్రఅల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (#APSDMA) తెలిపింది. ఇది పశ్చిమ- వాయువ్య దిశగా కదిలుతూ సోమవారం (నవంబర్ 24న) ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తదుపరి 32 నుంచి 40 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం (నవంబర్ 25) నాటికి నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇటీవల వారం రోజుల వ్యవధిలోనే రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. వాటి ప్రభావంతో ఏపీలో రాయలసీమతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలకు రైతులకు ఇబ్బంది కలుగుతోంది. వరి కోతలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో రైతులు వెంటనే కుప్పలు వేసుకోవాలని, ధాన్యం తడవకుండా భద్రపరుచుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ధాన్యం రంగు మారకుండా పట్టాలతో కప్పి ఉంచాలని, తడిసిన గింజలు మొలకెత్తకుండా, నాణ్యత పోకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు.
నవంబర్ 24న ఈ జిల్లాల్లో వర్షాలు
దక్షిణ అండమన్ సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీలో నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. సోమవారం (నవంబర్ 24న) ప్రకాశంతో పాటు నెల్లూరు, రాయలసీమలోని కడప, అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ధాన్యం తడవకుండా చూసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది.
తెలంగాణలో తగ్గిన చలి.. పెరిగిన ఉక్కపోత
తెలంగాణలో గత మూడు రోజులుగా చలి తగ్గినట్లు కనిపిస్తోండగా.. శని, ఆది వారాల్లో చాలా ప్రాంతాల్లో ఉక్కపోత పెరిగింది. ఇప్పుడు మనకు కేవలం 2 అవకాశాలు మాత్రమే ఉన్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. కేసు 1 ప్రకారం (55% అవకాశాలు) - వ్యవస్థ సకాలంలో ఏర్పడితే (నవంబర్ 26-28), అల్పపీడనం మధ్య వైపు కదులుతుంది. దాంతో ఈ 3 రోజుల్లో ఉత్తర ఆంధ్రప్రదేశ్, తూర్పు తెలంగాణలో మోస్తరు వర్షాలు, హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు, చలిగాలులు ఉండవు అని అంచనా వేశారు.
కేసు 2 ప్రకారం (45% అవకాశాలు) - వ్యవస్థ నిర్మాణం ఆలస్యం అయితే (నవంబర్ 28- 30) అల్పపీడనం భయంకరమైన తుఫానుగా మారుతుంది. కానీ ఒడిశా/ బంగ్లాదేశ్/ బర్మా వైపు తిరగడంతో మనకు చలిగాలులు, కొన్నిచోట్ల పొడి వాతావరణాన్ని తిరిగి తెస్తుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.