Satya Kumar On YS Jagan: కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాల విషయంలో మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కో కళాశాల కోసం రూ.వంద కోట్ల చొప్పున కాంట్రాక్టర్‌ నుంచి ముడుపులు తీసుకున్నారని ధ్వజమెత్తారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడినందున నిర్మాణాలు జరగలేదన్నారు. రూ.400 కోట్ల వరకు ఖర్చు అయ్యే దానికి రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పరిపాలనా ఆమోద ఉత్తర్వులు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. ప్రైవేటు భూములను కొనుగోలు జరగలేదని పేర్కొన్నారు. కళాశాలల నిర్మాణాలకు ప్రభుత్వ భూములను మాత్రమే కేటాయించారని తెలిపారు. అయినా ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరగడానికి పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీచేయడం వెనుక పెద్ద కమిషన్ల బాగోతం నడిచిందని దుయ్యబట్టారు. గుత్తేదారులు ఇచ్చిన కమిషన్లు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తుండడంతో దిక్కుతోచక... పీపీపీ విధానంలో కళాశాలలను నడిపేందుకు ముందుకొచ్చే వారిని బెదిరిస్తూ.. ఉత్తత్తి పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో మాట్లాడిన మంత్రి సత్యకుమార్ జగన్‌పై నిప్పులు చెరిగారు. 

Continues below advertisement

'అభివృద్ధిని అడ్డుకోవడానికి కుటిల యత్నాలు'

పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నడపడంపై అవగాహనరాహిత్యంతో జగన్‌ మాట్లాడుతున్నారని అన్నారు. "హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చెంప పెట్టువంటివి. ఎక్కడ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నా అడ్డుకునేందుకు అసందర్భప్రేలాపనలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం జగన్ అసత్య ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టించేందుకు యత్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన వైద్య కళాశాలల నిర్మాణాల్లో ఎన్ని మొండి గోడలతో ఉన్నాయో అందరూ చూశారు. ఇప్పుడు నర్సీపట్నం కళాశాల నిర్మాణాన్ని జగన్ పరిశీలించారు. బలప్రదర్శన చేస్తూ అమాయకులను ఇబ్బందులు పెట్టారు. గతంలో 5 కిలోమీటర్ల దూరానికి హెలికాఫ్టర్లు వాడిన జగన్ నర్సీపట్నానికి వెళ్లిన తీరు చూడండి. విశాఖలో క్రికెటు వరల్డ్ కప్ పోటీలు జరుగుతన్నప్పుడే జగన్‌‌ బలప్రదర్శన చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు  జగన్ సిద్ధమయ్యారు. నర్సీపటం కళాశాల నిర్మాణానికి రూ.500 కోట్లు పరిపాలనాపరమైన ఆమోద ఉత్తర్వులు ఇచ్చి... కేవలం రూ.10.80 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. అదే పులివెందుల వైద్య కళాశాలకు ఎక్కువ నిధులు ఇచ్చారు. వైద్య కళాశాలల అభివృద్ధిపై జగన్ తన హయాంలో ఎన్నడూ సమీక్ష జరపలేదు. గిరిజన యూనివర్శిటీని సైతం రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడేమో గిరిజనులపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారు. పార్వతీపురం వైద్య కళాశాల నిర్మాణానికి స్థల సేకరణకూడా చేయలేదు. 

హైకోర్టు వ్యాఖ్యలు చెంప పెట్టు!

కోర్టుల్లో పిటిషన్లు దాఖలుచేస్తున్నారని సత్యకుమార్ అన్నారు. వైద్య కళాశాలల పీపీపీ విధానం అడ్డుకునేందుకు హైకోర్టులో వాదించిన వారు వైసీపీ ఆస్థాన న్యాయవాది అని తెలిపారు. పీపీపీ విధానంలో కళాశాలల నిర్మాణాలను నిర్శిస్తే తప్పు ఏమిటని హైకోర్టు ప్రశ్నించడాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలన్నారు. "విద్యార్థులు విస్తృత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు నడపాలని నిర్ణయించారు. కళాశాలల నిర్మాణాలను రెండేళ్లలో పూర్తిచేసి, విద్యార్థులకు అందుబాబులో తేవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పీపీపీ విధానంలో కళాశాలలపై యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయి. ప్రభుత్వమిచ్చిన భూములు నిర్దిష్ట కాలవ్యవధి తర్వాత ప్రభుత్వ పరిధిలోనికి వస్తాయి. వైసీపీ పాలనలోనే 5 కొత్త వైద్య కళాశాలల్లో 50% సీట్లకు ఫీజులు పెట్టారు. కళాశాలల నిర్వహణలో పీపీపీ, ప్రైవేటీకరణ విధానం ఎలా ఉంటుందో జగన్‌కు బాగా తెలుసు. అయినా సొంత పత్రిక, ఛానెల్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను కొత్త వైద్య కళాశాలల వ్యవహరంపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించినప్పటికీ.. జగన్, ఆయన పార్టీ నేతల నుంచి స్పందన లేదు. శాసనసభ సమావేశాలకు ఎవరూ హాజరుకాలేదు. శాసనమండలిలో చర్చకు సిద్ధమైనప్పటికీ వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. ఇప్పటికైనా తాను చేసిన తప్పులకు జగన్ క్షమాపణలు చెప్పాలి. ప్రజలు రాజకీయంగా సమాధి కట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు." అని అన్నారు. 

Continues below advertisement