AP Latest Weather: ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓవైపు పిడుగుల వాన కురిపిస్తుంటే... మరోవైపు ఎండ నిప్పుల వాన కురిపించింది. ఇలాంటి భిన్న వాతావరణం శనివారం వరకు ఉంటుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఉత్తర కోస్తాంధ్రకు ఆనుకొని దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. సముద్రం నుంచి తేమ గాలుల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. దీని కారణంగానే అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
శనివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వివరించారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెట్ల కింద ఉండకూడదని సూచించారు.
గురువారం కూడా పలు ప్రాంతాల్లో జోరు వాన పడింది. సాయంత్రం 6 గంటల నాటికి కృష్ణా జిల్లా పెదఅవుటపల్లిలో 68.9మిమీ, ప్రకాశం జిల్లా సానికవరంలో 65.2 మిమీ,ఎర్రగొండపాలెంలో 62 మిమీ అధిక వర్షపాతం నమోదైంది. 18 ప్రాంతాల్లో 20మిమీ కంటే ఎక్కువ వర్షపాతం రికార్డైందని వెల్లడించారు.