Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణాల నిబంధనల్లో మరిన్ని సడలింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేవలం ఒక్క రూపాయి ఫీజుతో 50 చ.మీ.విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు అనుమతి ఇవ్వనున్నారు. 3 మీటర్ల ఎత్తు దాటిన భవనాలకు 1.5 మీటర్ల వెడల్పుతో బాల్కనీలు నిర్మించుకునేందుకు అనుమతి ఇస్తారు. 9 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్లలో కూడా రెడ్ కేటగిరీ మినహా ఇతర పరిశ్రమలకు అనుమతి లభించింది. చిన్న చిన్న ప్లాట్లలో ఉమ్మడిగా ఉండే చోట కొన్ని సడలింపులు చేశారు. 100 చ.మీటర్ల ప్లాట్ కు 2 మీ.వెడల్పు గల అంతర్గత రోడ్డు,100చ.మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లకు 3.6 మీటర్ల వెడల్పు గల అంతర్గత రోడ్డు ఉంటే సరిపోతుంది.
100 చ.మీ.లోపు ప్లాట్లకు ఆల్ రౌండ్ సెట్ బ్యాక్ లు అవసరం లేదు. 300 చ.మీ.కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు సెల్లార్ పార్కింగ్ కు అనుమతి లభించింది. ల్యాండ్ పూలింగ్ నిబంధనలు - 2025 ను నోటిఫై చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2015లో ల్యాండ్ పూలింగ్ స్కీంలో ఉన్న నిబంధనలే యథావిధిగా ఉంటాయని పేర్కొంది. అమరావతిలో స్మార్ట్ ఇండస్ట్రీలు నెలకొల్పేందుకు భూమి అవసరమని మంత్రి నారాయణ తెలిపారు. ప్రస్తుతం అమరావతిలో 10 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.