AP Group 2 Exam : AP Group 2 Exam Postpone: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేఖ రాసిన వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్. అన్ని వర్గాల నుంచి వస్తున్న మేరకు ఆదివారం జరిగే గ్రూప్‌2 పరీక్షలను వాయిదా వేసేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కాసేపట్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 2 అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూడు రోజుల నుంచి వివిధ వర్గాల నుంచి వస్తున్న అభ్యర్థన మేరకు తప్పుల సవరణ, పరీక్ష నిర్వహణపై పునరాలోచించాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. వచ్చే నెలలో కోర్టు విచారణ కూడా ఉన్నందున పరీక్ష వాయిదా వేయాలని సూచించింది.  

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం జరగనున్న గ్రూప్‌2 ఎగ్జామ్‌పై మూడు రోజులుగా తీవ్ర వివాదానికి కారణమైంది. ఎప్పటి నుంచో వివాదం ఉన్నప్పటికీ పరీక్ష దగ్గర పడటంతో వివాదం ముదిరింది. ఇందులో రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని, పోస్టింగ్ సమయంలో ఇబ్బందులు వస్తాయని అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని సరి చేసిన తర్వాత పరీక్ష పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఏంటీ సమస్య?ఏదైనా ప్రభుత్వ నోటఫికేషన్ విడుదల చేస్తే కచ్చితంగా అందులో వివిధ కమ్యూనిటీలకు పోస్టులు కేటాయించాలి. గత నోటిఫికేషన్లు, భర్తీ అయిన పోస్టులు ఆధారంగా రోస్టర్ విధానంలో ఈపోస్టుల కేటాయింపు ఉంటుంది. దీని ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆయితే 2023లో వేసిన గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌లో ఆ విధానంలోనే తప్పులు జరిగాయి. కులాల వారీగా పోస్టుల కేటాయింపు సరిగా జరగలేదని అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం చేశారు.  

రోస్టర్ విధానంలో పోస్టులు డివిజన్ సరిగా చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వడమేంటని అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇవేమీ పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ప్రిలిమ్స్‌ పరీక్ష పూర్తి చేసింది. అందులో దాదాపు 92వేల మందికిపై అభ్యర్థులు మెయిన్స్‌కు సెలెక్ట్ అయ్యారు. 

కీలకమైన ఆఖరి దశ పరీక్ష కాబట్టి ఈ పరీక్ష అయ్యేలోపు రోస్టర్ విధానంలో ఉన్న తప్పులు సరిచేయాలని అభ్యర్థించారు. అయినా ప్రభుత్వ వారి ఆందోళన పట్టించుకోలేదు. దీంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టులో విచారణ సాగడం, మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. 

కోర్టులో దీనిపై విచారణ సాగుతున్న టైంలోనే ఏపీపీఎస్సీ డేట్ ప్రకటించింది. ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్ష ఉంటుందని వెల్లడించింది. దీంతో అభ్యర్థులు కోర్టులో మరిన్ని పిటిషన్లు వేశారు. విచారణ సాగుతున్న టైంలో పరీక్ష ఎలా పెడతారంటూ వాయిదా వేయాలని అభ్యర్థించారు. దీన్ని విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు పరీక్ష వాయిదా వేసేందుకు అంగీకరించలేదు. 

కోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో అభ్యర్థులంతా ప్రత్యక్ష ఆందోళనలకు దిగారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. రోస్టర్ విధానం సరిగా లేకుంటే వెనుకబడిన కులాలు నష్టపోతాయని రిక్వస్ట్ చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి పరీక్ష వాయిదా వేయాలని నిర్ణయించింది. వెంటనే ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. మార్చి 11న కోర్టులో విచారణ ఉన్నందున, రోస్టర్‌లో తప్పులు సరి చేసేందుకు పరీక్ష వాయిదా వేయాలని రిక్వస్ట్ చేసింది.