Free Bus Scheme In AP: ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది కాలంగా చూస్తున్న ఉచిత బస్ ప్రయాణ పకం అమలులోకి వచ్చింది. ఆగస్టు  15 నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం  పవన్ కల్యాణ, మంత్రి నారా లోకేష్‌, బీజేపీ ఏపీ ప్రెసిడెంట్‌ మాధవ్‌తో కలిసి స్త్రీ శక్తి పేరుతో ప్రవేశ పెట్టిన ఉచిత బస్ ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. ఇకపై మహిళలు, విద్యార్థినులు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగానే రాష్ట్రవ్యాప్తంగా బస్‌లలో తిరగొచ్చు. పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లి రావచ్చు. వీళ్లతోపాటు ప్రభుత్వం మరికొందరికి కూడా ఉచిత బస్‌ ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 

దివ్యాంగులు

40 శాతానికి మించిన అంగవైకల్యం కలిగిన వ్యక్తులకు ప్రభుత్వం ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. రాష్ట్రంలో వారు ఏసీ మినహా ఏ బస్‌లలో అయినా ఉచితంగా తిరగొచ్చు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీస్‌లలో యాభై శాతం రాయితీ ఇస్తారు. ఈ బెనిఫిట్స్ కావాలంటే సదరు వ్యక్తి దివ్యాంగ సర్టిఫికెట్‌, ఫొటో ఐడీ చూపించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ స్కీమ్ వర్తిస్తుంది. 

మాజీ సైనికులు 

ఆంధ్రప్రదేశ్‌లో నివసించే మాజీ సైనికులకు, అమరవీర సైనికుల భార్యలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌లలో ఉచితంగా ట్రావెల్ చేసే ఛాన్స్ ఉంది. అంతర్‌రాష్ట్ర సర్వీస్‌లకు నార్మల్ ఛార్జెస్ తీసుకుంటారు. ఈ సేవలు అందుకోవాలంటే మాత్రం ఎక్స్ సర్వీస్‌ కార్డు చూపించాలి. 

వృద్ధులకు 

ఆంధ్రప్రదేశ్‌లో అరవై ఏళ్లకు మించిన వయసు ఉన్న వాళ్లకు పల్లె వెలుగు, సిటీ సర్వీస్‌లలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.కొన్ని బస్‌లలో యాభై శాతం రాయితీ కల్పిస్తారు. అయితే అరవై ఏళ్లు దాటినట్టు ఏజ్‌ ప్రూఫ్‌ ఐడీ చూపించాలి. 

స్వాతంత్ర సమరయోధులు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో గుర్తింపు పొందిన స్వాతంత్ర సమరయోధులకు, వారి జీవిత భాగస్వాములకు కూడా ఫ్రీ సర్వీస్ అందిస్తున్నారు. ఏసీ బస్‌లు మినహా అన్ని బస్‌లలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ప్రయాణ సమయంలో ప్రభుత్వం గుర్తింపు సర్టిఫికెట్‌ను చూపించాలి. 

విద్యార్థులు

విద్యార్థులకు పల్లెవెలుగు, సిటీ సర్వీస్‌లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. పట్టణాల్లో 22కిలోమీటర్లు గ్రామాణాల్లో 20 కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ చేయవచ్చు. ప్రయా సమయంలో కచ్చితంగా పాస్ చూపించాలి. ఈ పాస్ పొందాలంటే విద్యార్థులు చదివే విద్యా సంస్థ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని ఆర్టీసీ అధికారులకు చూపించాలి. అప్పుడే వారు ఫ్రీ సర్వీస్ పాస్ ఇస్తారు. 

జర్నలిస్టులు 

జిల్లాల్లో పని చేసే జర్నలిస్టులు కూడా అన్ని నగర లేదా సబ్‌రర్బన్ బస్‌లలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్‌ను చూపించాల్సి ఉంటుంది. మిగతా సర్వీస్‌లలో రాయితీ కల్పిస్తారు. 

ప్రజాప్రతినిధులు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్లేలు, ఎమ్మెల్సీలతోపాటు వారి భార్యలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలులో ఉంది. దాదాపు అన్ని సర్వీస్‌లలో వాళ్లు ఉచితంగా ట్రావెల్ చేయవచ్చు. వాళ్లకు ప్రభుత్వం ఇచ్చిన ఐడీ కార్డు చూపించాలి.