Pawan Kalyan With Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. అసెంబ్లీ ప్రాంగణంలో ఉప ముఖ్యమంత్రిని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు. బొత్సతో పాటు వచ్చిన పెద్దిరెడ్డి, ఇతర ఎమ్మెల్సీలు ఆ దృశ్యాన్ని చూసి పక్కకు తప్పుకున్నారు. అటుగా వెళ్తే తాము కూడా అలా చేయాల్సి వస్తుందని మెల్లిగా జారుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
అమరావతిలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలను వైసీపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. సభా సమావేశాలకు హాజరుకావడం లేదు. ఎమ్మెల్సీలు మాత్రం సభకు హాజరవుతున్నారు. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్య భారీగా ఉండటంతో వారంతా సభకు హాజరై బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వంతో ఢీ కొడుతున్నారు.
మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలను నడిపిస్తున్న ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ... రోజూ వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతూ మంత్రులపై ఎదురు దాడి చేస్తున్నారు. అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలతో మండలి అసెంబ్లీగా మారిపోయింది.
ఒకప్పుడు అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాలు ఎదురెదురు పడితే వాతావరణం హాట్ హాట్‌గా ఉండేది. ఇప్పుడు మండలిలో అలాంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వాతావరణంలో కూడా శుక్రవారం జరిగిన ఆసక్తికరమైన పరిణామం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమావేశాల బ్రేక్ తర్వాత ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కారు ఎక్కేందుకు వస్తున్నారు. అదే టైంలో అటుగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా వస్తున్నారు. పవన్ వస్తున్న విషయాన్ని గమనించిన బొత్స ఆయన్ని పలకరించేందుకు అక్కడ ఎదురు చూశారు. తన కోసం ఎదురు చూస్తున్న బొత్సను చూసి పవన్ కూడా కారు ఎక్కకుండానే ఎదురుగా వచ్చారు.
ఇలా పవన్ కల్యాణ్, బొత్స సత్యనారాయణ ఒకరి నొకరు పలకరించుకొని ఆలింగనం చేసుకున్నారు. బొత్స సత్యనారాయణతో అక్కడే ఉన్న పెద్దిరెడ్డి సహా వైసీపీ నేతలకు ఏం చేయాలో అర్థం కాలేదు. అలాగనే వీళ్లు కూడా వెళ్లి పవన్‌తో మాట్లాడే సాహసం చేయలేకపోయారు. అంతే బొత్స సత్యనారాయణ అలా వెళ్లడంతో వేరే దారి నుంచి తప్పించుకొని వెళ్లిపోయారు.
Also Read: షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
శాసన సభ సమావేశాలను బహిష్కరించిన వైసీపీ ఎమ్మెల్యేలు ఎన్నికల కారణంగా సభకు వచ్చారు. అయితే ఆఖరి నిమిషంలో ఎన్నికలన్నింటినీ బహిష్కరిస్తున్నట్టు అధిష్టానం ప్రకటించింది. దాదాపు 60 దశాబ్దాల తర్వాత తొలిసారిగా ప్రజా పద్దుల కమిటీకి ఎన్నికలు జరగాల్సి ఉండేది. సాధారణంగా ఈ పదవి ప్రతిపక్ష పార్టీకే ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈసారి ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి పదిశాతం ఓట్లు రాకపోవడంతో ఆ పదవి కూడా రాకూండా పోయింది. వీళ్లకు 18 మంది సభ్యులు ఉంటే ఈ పదవికి అర్హులు అయ్యే వారని అధికార పార్టీ చెబుతోంది. కానీ వైసీపీ నుంచి 11 మంది మాత్రమే విజయం సాధించడంతో ఆ పీఏసీ ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పింది.
ఈ పదవి ప్రతిపక్షానికి ఇవ్వబోరని తెలిసినప్పటికీ తమ ఉనికి చాటుకోవడానికి వైసీపీ పీఏసీ ఎన్నికల్లో పోటీకి సిద్దమైంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం నామినేషన్ కూడా వేశారు. కానీ చివరి నిమిషంలో ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు పార్టీ చెప్పడంతో వచ్చిన ఎమ్మెల్యేలు వెనుదిరిగారు.