కరోనా లాంటి విపత్కార పరిస్థితుల్లో కూడా రైతులకు అండగా నిలిచామన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్. నాబార్డ్ వార్షిక రుణప్రణాళికపై సమీక్షించిన సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.  


తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై   సమీక్ష చేపట్టారు.  ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాబార్డ్ ఛైర్మన్ జీఆర్ చింతల ఈ సమీక్షలో పాల్గొన్నారు. 


సమీక్షలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ... కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రంగానికి ప్రభుత్వం మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు. ఇందులో బ్యాంకులు, నాబార్డ్ చేస్తున్న సాయం ప్రస్తావించారు జగన్.  రాష్ట్రంలో చేస్తున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్, బ్యాంకులు హెల్ప్ చేస్తున్నాయని కితాబిచ్చారు. కోవిడ్ సమయంలో చాలా మంచి సహాయాన్ని అందించాయన్నారు. 


వాళ్లిచ్చిన సహాయంతోనే రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, రైతులకు ఉచిత పంటల బీమా ఇవన్నీ అమలు చేస్తున్నామని అన్నారు సీఎం.


రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇక్రాప్‌ నమోదు చేసి పారదర్శకంగా చెల్లింపులు చేస్తున్నట్టు వెల్లడించారు జగన్. విత్తనం అందించినప్పటి నుంచి పంట కొనుగోలు చేసే వరకు ఆర్బీకేలు రైతులకు అండగా నిలుస్తున్నాయన్నారు.గ్రామీణ నియోజక వర్గాల స్థాయిలో అగ్రిల్యాబ్స్‌ ఏర్పాటు చేశామన్నారు సీఎం. ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ అనుబంమధ రంగాల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.


ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు బ్యాంకులు, సొసైటీలకు కోఆర్డినేటర్‌లుగా వ్యవహరిస్తారని తెలిపారు సీఎం జగన్. దీనిపై బ్యాంకులతో కలిసి ప్లాన్ ఆఫ్‌ యాక్షన్ రెడీ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల బలోపేతంపై దృష్టి పెట్టామన్న సీఎం జగన్... అగ్రికల్చర్‌లో టెక్నాలజీకి అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్బీకేల స్థాయిలో డ్రోన్లు తీసుకొస్తామన్నారు. వీటిని నిర్వహించేందుక నైపుణ్యాన్ని గ్రామస్థాయిలోనే అభివృద్ధి చేస్తామన్నారు.