Chandra Babu On Cyclone:ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుపాను ధాటికి దాదాపు ఐదు వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు వేసింది. పూర్తి అంచనాలు వచ్చిన తర్వాత కేంద్రానికి లెక్కలు పంపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో చాలా వరకు నష్టాన్ని తగ్గించామని లేకుంటే ఎవరూ ఊహించని స్థాయిలో విధ్వంసం ఉండేదని పేర్కొన్నారు. ఇప్పుడు జరిగిన నష్టమంతా మన చేతుల్లో లేదని పేర్కొన్నారు. తుపాను సమయంలో ప్రజల కోసం క్షేత్రస్థాయి అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అంతా బాగా పని చేశారని, టీం వర్క్ చేస్తే ఫలితాలు ఇలా ఉంటాయని ముఖ్యమంత్రి కొనియాడారు. 

Continues below advertisement


అంతా కలిసి ఒకే మైండ్‌సెట్‌తో పని చేసి తీవ్ర తుపానును ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. గురవారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ప్రపంచంలో ఏ దేశం వాడుకోని విధంగా టెక్నాలజీని వాడుకున్నట్టు తెలిపారు. తుపాను సమయంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో రియల్‌ టైంలో వివరాలు తెలుసుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని వివరించారు. ఇంత విధ్వంసకర తుపాను రాష్ట్రంలో వచ్చిన ఒక్క రోజులోనే పరిస్థితులను నార్మలైజ్ చేయగలిగామని పేర్కొన్నారు. గతంలో తుపానులు వస్తే వారం పదిరోజుల వరకు పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేవి కావని ఈసారి మాత్రం ఒక్క రోజులో మాత్రమే అన్నీ సరి చేశామని వివరించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సచివాలయ ఉద్యోగి వరకు అంతా బాగా పని చేశారని అందుకే నష్టాన్ని తగ్గించామన్నారు. ఇప్పటి వరకు వచ్చిన అంచనాలు ప్రకారం 5,265.51 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఇంకా ప్రక్రియ జరుగుతోందని పేర్కొన్నారు. 



అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇలాంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు మెకానిజాన్ని సిద్ధం చేశామని అది ఇప్పుడు బాగా ఉపయోగపడిందన్నారు సీఎం. తుపాన్లు రాకుండా అపలేం కానీ సమర్థంగా ఎదుర్కోగలమని నిరూపించామని తెలిపారు. పక్కా ప్లానింగ్‌తో ఉంటే యంత్రాంగానికి సరైన డైరెక్షన్ ఇవ్వగలిగితే ఇలాంటి ఫలితాలు వస్తాయని వెల్లడించారు. ఆర్టీజీఎస్ కేంద్రం ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఏం చేయాలనే చెప్పే స్థాయికి వచ్చామని అన్నారు. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడుకున్నామని వివరించారు. ఇలాంటి విపత్కార పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఒక మాన్యువల్ తయారు చేశామని వెల్లడించారు.  


వివిధ మార్గాల్లో వచ్చిన డేటాను ఆధారంగా చేసుకొని ప్రజలను అధికారులను అప్రమత్తం చేసినట్టు సీఎం తెలిపారు. వచ్చే కాలంలో ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అమరావతి నుంచే గ్రామాలకు నేరుగా చేర వేసే ప్రక్రియ కూడా వస్తుందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీల కార్యకర్తలు, నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారికి భరోసా ఇచ్చారని సమస్యలను నేరుగా ప్రభుత్వానికి తెలియజేశారని వెల్లడించారు. అన్ని వ్యవస్థలు ఇంత సమర్థంగా పని చేస్తున్నా కొందరు ఫేక్ మనుషులు ఇంకా బురదజల్లే పని చేస్తున్నారని జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు విమర్శలు చేశారు. అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పుడు కేంద్రానికి నివేదికలు పంపిన తర్వాత ప్రత్యేక చొరవతో నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.