Ap CM Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అద్భుత విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి అనేక అంశాలు దోహదం చేశాయి. వీటిలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో కూడా ముఖ్య కారణంగా చెబుతారు. మేనిఫెస్టోలో ప్రకటించిన అనేక హామీలు పట్ల ప్రజలు ఆకర్షితులై పెద్ద ఎత్తున కూటమికి ఓట్లు వేశారు. ముఖ్యంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతినెల రూ.1500 చొప్పున చెల్లిస్తామన్న హామీ, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ వంటి పథకాల పట్ల ఆకర్షితులై కూటమికి భారీగా ఓట్లు వేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 164 స్థానాల్లో కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు దిశగా కూటమి నాయకులు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పెన్షన్ పెంపుతోపాటు డీఎస్సీ విడుదల వంటి హామీలను అమలు చేసేలా చంద్రబాబు నాయుడు 5 సంతకాలను చేశారు. మిగిలిన పథకాలు అమలకు సంబంధించి ప్రభుత్వ అధికారులు ఇప్పటికే పని చేస్తున్నట్లు తెలుస్తోంది. 


ఈ రెండు పథకాలు అమలుపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం 


కూటమి ప్రభుత్వం మరో రెండు పథకాలను అమలు చేసేందుకు అనుగుణంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం కాగా, రెండోది మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకంగా చెబుతున్నారు. ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం ఎప్పుడు నుంచి ప్రారంభం అవుతుంది అన్న ఆసక్తి లబ్ధిదారుల్లో కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కూడా ఈ పథకాన్ని అక్కడ ప్రభుత్వం అమలు చేస్తోంది. తెలంగాణలో సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు అందిస్తుండగా, ఏపీలో మాత్రం పూర్తిగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లును ఇవ్వనున్నారు. ఈ పథకం అమలకు సంబంధించిన విధివిధానాలు తయారీపై అధికారులు ప్రస్తుతం పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. కొద్దిరోజుల్లోనే ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది. తెలంగాణలో అమలు చేస్తున్న ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ఇక్కడి అధికారులు పరిశీలిస్తున్నారు. ఉచిత పథకాన్ని అందించేందుకు లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయాలి, ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అన్నదానిపై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తొలి వంద రోజుల్లోనే పలు పథకాలను అమలు చేసింది. వీటిలో ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్ వంటివి పథకాలు ఉండగా, ఈ క్రమంలోనే ఏపీలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఉచితంగా గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రజల నుంచి కూడా ఈ పథకాలను అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.


పెన్షన్ పెంపు లబ్ది ప్రజలకు అందజేత..


ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో వేయి రూపాయల పెన్షన్ను పెంచి రూ.4 వేల రూపాయలను లబ్ధిదారులకు జూలై నెలలో అందజేసింది. అలాగే, మూడు నెలలకు సంబంధించిన ఎరియర్స్ కలిపి రూ.7 వేల రూపాయలను ఒక్కో లబ్ధిదారుడికి అందించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఇతర పథకాలు అమలుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తరువాత ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు.  ఆ తర్వాత ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయనున్నారు. ముందుగా ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తే, ఆ తరువాత మహాశక్తి దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే హామీ అమలు చేయనున్నారు. అయితే, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఈ స్కీమ్ కు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపై అధికారులు పనిచేస్తుండడంతో ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.  


నిరుపేదలకు ఎంతో మేలు 


ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తే నిరుపేదలకు ఎంతో మేలు చేకూరనుంది. ప్రస్తుతం ఏపీలో గ్యాస్ సిలిండర్ ధరలను పరిశీలిస్తే రూ.860 రూపాయలు ఉంది. ప్రాంతాలు వారీగా ఈ సిలిండర్ ధరలో కొంత మార్పులు ఉండవచ్చు. అంటే మూడు సిలిండర్లు ఉచితంగా లబ్ధిదారులు అందిస్తే.. రు.2600 వరకు లబ్ధిదారులకు మిగలనుంది. ఈ పథకం అమలు కోసం వేలాదిమంది మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసే తేదీ ఇప్పుడు ప్రకటిస్తుందో చూడాల్సి ఉంది.