AP Assembly Live Updates 2022: వచ్చే ఏడాది విశాఖ నుంచి పాలన, మంత్రి అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు 

ఏపీ అసెంబ్లీ సమావేశాల నిరంతర అప్ డేట్స్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 16 Sep 2022 04:33 PM
వచ్చే ఏడాది విశాఖ నుంచి పాలన, మంత్రి అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు 

మంత్రి గుడివాడ అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే విద్యాసంవత్సవరంలో విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన వికేంద్రీకరణపై త్వరలో బిల్లు పెడతామని స్పష్టం చేశారు.  

ఏపీ శాసనసభ సోమవారానికి వాయిదా 

ఏపీ శాసనసభ సోమవారానికి వాయిదా పండింది. ప్రభుత్వం శాసనసభలో 8 ఎనిమిది బిల్లులు ప్రవేశపెట్టింది వాటికి సభ ఆమోదం తెలిపింది. ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి  ఢోకా లేదని సీఎం జగన్ సభలో తెలిపారు. 

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదు - సీఎం జగన్ 

CM Jagan : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఢోకా లేదని సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీ రెండో రోజు సమావేశాల్లో సీఎం జగన్ మాట్లాడుతూ... రాష్ట్రంలో బాగుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. చంద్రబాబు ఆర్థిక పరిస్థితే బాగోలేదేమో అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉందన్నారు. ఆర్థిక పరిస్థితికిపై కేంద్రం, ఆర్బీఐకి తప్పుడు లేఖలు రాశారన్నారు. 

AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ రెండో రోజు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ నుంచి వరుసగా రెండో రోజూ టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ సస్పెండ్‌ చేశారు.  స్పీకర్‌ పోడియం వద్ద తెదేపా ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో పాటు సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని వారిని సస్పెండ్‌ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. వెంటనే అందుకు ఆమోదం తెలుపుతూ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.

కేసీఆర్, జగన్ ధైర్యంగా రాజీనామా చేశారు: మంత్రి, మేరుగు నాగార్జున

రాజధానికి సంబంధించి నా నియోజకవర్గంలో టీడీపీ పాదయత్రలు చేస్తోంది, ఆ పాదయాత్రలో రాజధాని ప్రాంత రైతులు, దళితులు ఎంత మంది  ఉన్నారని మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. మీ ఉద్యమంలో ఉన్నవారంతా బయటి నుంచి వచ్చినవారేనని.. నక్కా ఆనంద్ బాబు మీ స్థాయి ఏంటి, జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా అని ప్రశ్నించారు. 


మా ముఖ్యమంత్రి పై టీడీపీ నేతలు బరితెగించి మాట్లాడతున్నారు. టీడీపీ నేతలు ప్రజల్లో మనగలిగే పరిస్థితి లేదు
 తెలంగాణ కోసం కేసీఆర్, వైసీపీ పార్టీ ఏర్పాటు కోసం జగన్ ధైర్యంగా రాజీనామాలు చేశారు  
మీకు దమ్ముంటే మీవాళ్లంతా రాజీనామా చేయండి ... ఎన్నికలకు వెళ్దాం  
మీ ఉడత ఊపుళ్లకు చింతకాయలు కూడా రాలవు 
రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసు నా దగ్గర డబ్బులు లేకే భూములు కొనలేకపోయానని మీరే చెప్పారు 
అందుకే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతున్నాం 
వేమూరు నియోజకవర్గంలో మీ ఉద్యమంలో ఎంతమంది రాజధాని ప్రాంతం వారున్నారు 
మీ నాయకుడి ఆలోచన దళిత వ్యతిరేక ఆలోచన  
దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు దగ్గర ఇంకా ఎందుకున్నారోనని బాధకలుగుతుంది 
చంద్రబాబు దగ్గర మీరెందుకు ఇంకా ఛప్రాసీ ఉద్యోగం చేస్తున్నారో అర్ధం కావడం లేదు 
నిజంగా దళితుల్లో పుట్టిన వారెవరూ చంద్రబాబు దగ్గర ఉండరు. చంద్రబాబు దళిత ద్రోహి 
దళితులను వాడుకుని వంచించిన వ్యక్తి చంద్రబాబు 
అంబేద్కర్ విగ్రహం పెడతానని చెప్పి మోసం చేశాడు 
ఏమీ లేని చోట చెట్లు, పుట్టలో అంబేడ్కర్ విగ్రహం పెడతారా 
చంద్రబాబు మోసాలను ఎండగట్టడానికి అంబేద్కర్ పాదాల సాక్షిగా ఎక్కడైనా చర్చకు సిద్ధం 
మంత్రి రోజాకు దళితులంటే అమితమైన గౌరవం 
గతంలో ఆమె మాట్లాడిన మాటలను వక్రీకరించి టీడిపి నేతలు ప్రచారం చేస్తున్నారు

ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది.  సాయంత్రం వరకూ నామినేషన్ల స్వీకరణ సాగనుంది.వైఎస్సార్‌సీపీ నుంచి కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్‌ వేసే అవకాశం ఉంది.కోలగట్ల వీరభద్రస్వా మధ్యాహ్నం 3.30 గంటలకు నామినేషన్‌ వేయనున్నట్లు సమాచారం. సోమవారం శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరుగుతుందని స్పీకర్‌ ఇదివరకే ప్రకటించారు. బలాబలాల రిత్యా డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.

ప్రహరీ గోడ తప్పితే స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం చేశారు: టీడీపీ ఎమ్మెల్యే

మూడేళ్లల్లో ప్రహరీ గోడ తప్పితే స్టీల్ ప్లాంట్ విషయంలో ఏం చేశారని టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం సొంత జిల్లాలోనే ఎందుకింత నిర్లక్ష్యమని, ఇంకా 820 మంది రైతులకు పరిహరం చెల్లించాల్సి ఉందని సభలో ప్రస్తావించారు.

Kadapa Steel Plant: కడప స్టీల్ ప్లాంట్ ఎప్పటికి పూర్తి చేస్తారు: మంత్రికి అచ్చెన్నాయుడు సూటి ప్రశ్న

సీఎం జగన్ సొంత జిల్లా కడపలో స్టీల్ ప్లాంట్ కోసం అప్పటి సీఎం చంద్రబాబు ఫౌండేషన్ వేశారని టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు అన్నారు. దాన్ని పక్కన పెట్టి మరో చోట సీఎం జగన్ 23 డిసెంబర్ 2019న శంఖుస్ధాపన వేశారని గుర్తుచేశారు. ఎట్టి పరిస్ధితుల్లో కడప స్టీల్ ప్లాంట్ పూర్తిచేసి ఎన్నికలకు వెళ్తామని సీఎం జగన్ చెప్పారు. కానీ మూడేళ్లలో ఒక్క ఇటుక ముక్క కూడా అక్కడ వేయలేదని ఎద్దేవా చేశారు.
ఏపీ విభజన తర్వాత కడప స్టీల్ ప్లాంట్ పై సీఎం జగన్ ఒక్కసారి కూడా కేంద్రాన్ని అడగలేదు.
కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభం కాలేదు, విశాఖ ఉక్కు ప్రమాదంలో పడింది, ఏకంగా ప్రైవేటేకరణ జరుగుతోంది
కడప స్టీల్ ప్లాంటుకు పేదలు భూములిచ్చిన వారికి అదనంగా రూ. లక్ష ఇస్తామని చెప్పారు
కడప స్టీల్ ప్లాంట్ ఎప్పటికి పూర్తి చేస్తారో మంత్రి చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

స్టీల్ ప్లాంట్ ల్యాండుకు రూ. 37.50 కోట్లు పరిహరం చెల్లించాం: మంత్రి గుడివాడ అమర్‌నాథ్

కోవిడ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ ఇండస్ట్రీ బాగా దెబ్బతిన్నది.
కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భాగస్వామ్యం కోసం వెతుకుతున్నామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. 
స్టీల్ ప్లాంట్ ల్యాండుకు సంబందించి రూ. 37.50 కోట్లు పరిహరం చెల్లించాం.

అసెంబ్లీలో ప్రారంభమైన ప్రశ్నోత్తరాలు

అసెంబ్లీలో ప్రారంభమైన ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి
కడప ఉక్కకర్మాగారంపై అచ్చెన్న వేసిన ప్రశ్నపై చర్చ.
కడప స్టీల్ ప్లాంట్ విషయంలో మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు.
కడప స్టీల్ ప్లాంట్ అంశంపై విభజన చట్టంలో ఉన్న అంశాలను వివరించిన మంత్రి బుగ్గన.
కడప స్టీల్ పెట్టేందుకు  ఆలోచించొచ్చనే విభజన చట్టంలో ఉంది.
స్టీల్ ప్లాంట్ విషయమై విభజన చట్టంలో ఏముందో సరిగా చూడండి.
కడపలో స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నం చెయ్యొచ్చని అని మాత్రమే చట్టంలో ఉంది.
కడప స్టీల్ ప్లాంట్ అంశమై విభజన చట్టంలో MAY BE అని మాత్రమే ఉంది SHALL అని లేదు.

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా 

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. శాసనసభలో వికేంద్రీకరణపై వాడీవేడి చర్చ జరిగింది. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని మంత్రి బుగ్గన అనడంపై టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. టీడీపీ సభ్యులను తొలిరోజు సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేశారు. అంతకు ముందుకు మంత్రి మేరుగ నాగార్జున అభ్యంతరకర వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు ఆందోళన తెలిపారు. చివర్లో వికేంద్రీకరణపై సీఎం జగన్ మాట్లాడారు. 

కట్టని రాజధాని కోసం 1000 రోజులుగా కృత్రిమ ఉద్యమం - సీఎం జగన్ 

CM Jagan : వికేంద్రీకరణ చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి 1000 రోజులుగా ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు. కట్టని రాజధాని గురించి కట్టలేని గ్రాఫిక్స్‌ గురించి కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలు చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ సొంత అభివృద్ధి కోసమే అమరావతి ఉద్యమం అన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ కన్నా కట్టని, కట్టలేని అమరావతి చంద్రబాబుకు గొప్పదన్నారు.  దోచుకో, పంచుకో, తినుకో అనే డీపీటీ పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. రాజధానిలో తన అనుచరులతో చంద్రబాబు భూములు కొనుగోలు చేశారని సీఎం జగన్ ఆరోపించారు. 

శాసనసభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ 

TDP MLAs : శాసనసభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. రాజధాని వికేంద్రీకరణపై స్వల్ప చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు  స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు.  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. ఆ సమయంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. స్పీకర్ పై టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్స్ ను పిలిచి టీడీపీ సభ్యులను సీట్లలో కూర్చొబెట్టాలని కోరారు. అయినా టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో వారిని సస్పెండ్ చేశారు.  టీడీపీ సభ్యులు అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వెంకటరెడ్డి, సీవీ జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్ రావు, రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంచల రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయ స్వామి తదితరులను సభ నుంచి సప్పెండ్ చేస్తున్నట్లు సభాపతి తెలిపారు.  

శాసనసభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ 

TDP MLAs : శాసనసభ నుంచి 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. రాజధాని వికేంద్రీకరణపై స్వల్ప చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు  స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు.  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు. ఆ సమయంలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. స్పీకర్ పై టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్స్ ను పిలిచి టీడీపీ సభ్యులను సీట్లలో కూర్చొబెట్టాలని కోరారు. అయినా టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో వారిని సస్పెండ్ చేశారు. 

10 మంది చేతుల్లో 10 వేల ఎకరాలు, అమరావతిలోవి తాత్కాలిక నిర్మాణాలు- మంత్రి బుగ్గన

Minister Buggana : వికేంద్రీకరణపై శాసనసభలో స్పల్ప కాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ అమరావతి భూములు కొందరి చేతుల్లోనే ఉన్నాయన్నారు.  అమరావతి ఉన్నవన్నీ తాత్కాలిక నిర్మాణాలు అన్నారు. అమరావతిలోని 30 వేల ఎకరాల్లో 10 మంది చేతుల్లోనే 10 వేల ఎకరాలు ఉన్నాయని సభకు తెలిపారు. టీడీపీ అంటేనే టెంపరరీ డెవలప్‌మెంట్‌ పార్టీ అని ఆరోపించారు. అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా? అని మంత్రి ప్రశ్నించారు. 

10 మంది చేతుల్లో 10 వేల ఎకరాలు, అమరావతిలోవి తాత్కాలిక నిర్మాణాలు- మంత్రి బుగ్గన

Minister Buggana : వికేంద్రీకరణపై శాసనసభలో స్పల్ప కాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ అమరావతి భూములు కొందరి చేతుల్లోనే ఉన్నాయన్నారు.  అమరావతి ఉన్నవన్నీ తాత్కాలిక నిర్మాణాలు అన్నారు. అమరావతిలోని 30 వేల ఎకరాల్లో 10 మంది చేతుల్లోనే 10 వేల ఎకరాలు ఉన్నాయని సభకు తెలిపారు. టీడీపీ అంటేనే టెంపరరీ డెవలప్‌మెంట్‌ పార్టీ అని ఆరోపించారు. అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా? అని మంత్రి ప్రశ్నించారు. 

AP Assembly Comments: అసెంబ్లీలో మంత్రి వ్యాఖ్యలతో వాగ్వాదం, టీడీపీ ఎమ్మెల్యే అభ్యంతరం

ఏపీలో అసెంబ్లీలో మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ కాసేపు వాగ్వాదం జరిగింది. మంత్రి మేరుగ నాగార్జున టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిపై అభ్యంతరకంగా వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. నువ్వు దళితులకే పుట్టావా అంటూ మంత్రి కామెంట్లు చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభ్యుల పుట్టుక గురించి అధికార పార్టీ నేతలు ప్రస్తావించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే సహా టీడీపీ నేతలు స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

AP Assembly: 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన జరిగిన ప్రజాపద్దుల కమిటీ (బీఏసీ) సమావేశంలో సీఎం జగన్ తో పాటు, వైసీపీ నుంచి బుగ్గన, జోగి రమేష్, ప్రసాదరాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీని 5 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు.

AP Assembly News: చనిపోయిన నేతలకు సభలో సంతాపం

ఏపీ అసెంబ్లీలో ఇటీవల కన్నుమూసిన నేతలకు సంతాపం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర రాజు, బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి, పులపర్తి నారాయణ మూర్తి, జేఆర్ పుష్పరాజ్, నల్లమిల్లి మూలారెడ్డి చనిపోవడం పట్ల కాసేపు మౌనం పాటించారు. అనంతరం సభ వాయిదా పడింది. తర్వాత బీఏసీ సమావేశం జరిగింది.

AP Assembly Updates: చంద్రబాబు డుమ్మా, టీడీపీ సభ సాగనివ్వట్లేదు - గడికోట శ్రీకాంత్ రెడ్డి

టీడీపీ నేతలు ‘జాబు ఎక్కడ జగన్?’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ రాష్ట్రంలో నిరుద్యోగం గురించి చర్చ జరపాలని నినాదాలు చేశారు. దీంతో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని అన్నారు. సభ సమయం వేస్ట్ చేయడానికి టీడీపీ లీడర్లు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అసెంబ్లీకి మాజీ సీఎం చంద్రబాబు మళ్లీ డుమ్మా కొట్టారని అన్నారు. ఆ పార్టీ నేతలు ఇప్పుడు సభను అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు.

AP Assembly Sessions: నిరుద్యోగ సమస్యలపై సభలో టీడీపీ సభ్యుల నినాదాలు

AP Assembly Sessions: ఏపీ ప్రభుత్వం చెప్పిన జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ గా మారిపోయిందని టీడీపీ సభ్యులు అన్నారు. నిరుద్యోగ సమస్యలపై టీడీపీ సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఉద్యోగాలేవి అని, నిరుద్యోగులకు నగదు ఇచ్చారా అని ప్లకార్డులు పట్టుకువచ్చి ప్రదర్శించారు. ప్రశ్నోత్తరాలు తరువాత అవకాశం ఇస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రతిపక్ష సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు.

AP Assembly: టీడీపీ నేతల తీరు పట్ల బుగ్గన అసహనం

అసెంబ్లీలో టీడీపీ నేతల తీరు పట్ల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గతంలో వాయిదా తీర్మానం ప్రవేశపెడితే ప్రశ్నోత్తరాలు జరపాలని వారే పట్టుబట్టారని, ఇప్పుడు పద్ధతి ప్రకారం ప్రశ్నోత్తరాలు, తర్వాత బీఏసీ సమావేశం జరుపుదామనుకుంటే దీనికి అడ్డుపడి వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. సభను అడ్డుకోవడానికే టీడీపీ లీడర్లు అసెంబ్లీకి వచ్చినట్లు ఉందని బుగ్గన మండిపడ్డారు.

టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులు: మంత్రి జోగి రమేష్

టీడీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారని మంత్రి జోగి రమేష్ అన్నారు. టీడీపీ సభ్యులు చంద్రబాబు ఆదేశాలతో సభ సజావుగా సాగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ శవయాత్రను ప్రజలు చేపడతారంటూ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదన్నారు.

రైతులకు అందించే పథకాల వివరాలపై మాట్లాడిన మంత్రి కాకాణి

వ్యవసాయ అనుబంధ సంస్థలు సమగ్రంగా పథకాలను అమలు చేస్తున్నామని, పశువులకు టీకాలు వేసేలా చర్యలు తీసుకున్నాం. లబ్ధిదారుల సామాజిక తనిఖీ చేపట్టడం, వ్యవసాయ యంత్రాలను అందించడం, సూక్ష్మ పోషకాలు అందించడం, వైఎస్సార్ పొలంబడి లాంటి పథకాలతో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 155 251తో సమస్యలు తెలుసుకుని సలహాలు ఇస్తున్నామని , మొదలైన చర్యలు తీసుకున్నామని చెప్పారు.

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, వాయిదా తీర్మానంపై చర్చకు విపక్షాల పట్టు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యాయి. జాతీయ గీతాలాపన ముగియగానే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. వారు నినాదాలు చేస్తుండగానే, కాసేపు ప్రశ్నోత్తరాలు సాగించారు.

Background

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అత్యంత కీలక దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. అసలు ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర వరకూ సమయం ఉంది. కానీ నేడో రేపో ఎన్నికలన్నట్లుగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు ఏ స్ట్రాటజీతో వెళ్లాలని సీఎం జగన్ సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. తాను సగం మంది జనాభాకు ప్రతి ఇంటికి ఏటా రూ. నాలుగైదు లక్షలు ఇస్తున్నానని... గడప గడపకూ పార్టీ నేతలను పంపించి చెబుతున్నారు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తననే ఎన్నుకోవాలని ఆయన పార్టీ నేతల ద్వారా సందేశం పంపుతున్నారు. ఈ కార్యక్రమాన్ని జగన్ సీరియస్‌గా తీసుకున్న తీరు చూస్తే వచ్చే ఎన్నికల్లో తన సంక్షేమ పాలనపై రిఫరెండంగానే ఓటింగ్‌కు వెళ్లాలని డిసైడయ్యారని అనుకుంటారు. కానీ జగన్ ఇప్పుడు అనూహ్యంగా రూటు మారుస్తున్నారు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. మూడు రాజధానులే తమ విధానమని.. ప్రకటించబోతున్నారు. మూడు రాజధానులకే ప్రజల మద్దతు ఉందని ఈ అంశాన్నే అజెండాగా చేసుకుని ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంలో ఉన్నారన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. ఇప్పుడు జగన్ ముందు  రెండు మార్గాలున్నాయి. ఒకటే సంక్షేమం. రెండు మూడు రాజధానులు. ఏ పడవపై పెట్టి  ఎన్నికలు ఈదుతారన్నది ఇప్పుడు కీలకంగా మరింది. 


సంక్షేమంపై ఎంతో నమ్మకం పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి !
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తన పాలనపై ఎంతో నమ్మకం. తాను ప్రతి కుటుంబం సుభిక్షంగా ఆకలి దప్పులు లేకుండా.. చదువుల ఖర్చులేకుండా.. వైద్యం తిప్పలు లేకుండా ఖర్చులకూ డబ్బులిస్తూ.. అందర్నీ సుఖంగా చూసుకుంటున్నానని నమ్ముతున్నారు. అర్హుల పేరుతో చాలా మంది అనర్హులను చేసినప్పటికీ ఆయన .. తన ఓటు బ్యాంక్ చెక్కు చెదకుండా ఉండేంతగా పథకాలను అమలు చేస్తున్నానని గట్టి నమ్మకంతో ఉన్నారు. వారందరి ఓట్లు గుంపగుత్తగా తనకే పడతాయని ధీమాగా ఉన్నారు. అందుకే 175 సీట్లు ఎందుకు గెలవకూడదని ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్టీ నేతలకూ అదే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన సంక్షేమ పాలనే అజెండాగా ఓట్లు అడగాలని అనుకున్నారు. అందుకే పార్టీ నేతలందర్నీ గడప గడపకూ పంపుతున్నారు. 


హఠాత్తుగా మూడు రాజధానుల వైపు చూపు !
అయితే జగన్ ఇప్పుడు తన సంక్షేమంపై ధీమా కోల్పోయినట్లుగా కనిపిస్తోంది. మూడు రాజధానుల ఎజెండాగా ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. అందుకే మూడు రాజధానుల అంశాన్ని హఠాత్తుగా తెరపైకి తెచ్చారు. మూడు రాజధానుల బిల్లు పెడతామని మంత్రులు ప్రకటనలు చేశారు. వాస్తవంగా చూస్తే మూడు రాజధానుల బిల్లు మరోసారి పెట్టడం చట్టం చేయడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే హైకోర్టు ఈ అంశంలో స్పష్టమన తీర్పు ఇచ్చింది. అయితే అసెంబ్లీ చర్చించడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. అసెంబ్లీలో చర్చించి.. మూడు రాజధానులపై తన వాదన వినిపించి.. అదే అదెండాతో ప్రజల్లోకి వెళ్లి .. మరోసారి ఎన్నికలను ఎదుర్కోవాలన్న ఆలోచన జగన్ చేస్తున్నారని అంటున్నారు. అందుకే పార్టీ నేతలతో .. మూడు రాజధానులపై ఘాటుైన ప్రకటనలు చేయిస్తున్నారని అంటున్నారు. 


ప్రజల పల్స్ తెలుసుకోవడానికా ?
అధికారం చేపట్టిన కొత్తలో మూడు రాజధానులు అంటే కొంత కదలిక కనిపించింది. అమరావతిలో ఓ వర్గం వారే అభివృద్ధి చెందుతారనే ప్రచారాన్ని వ్యవస్థీకృతంగా చేసి ఉండటంతో ఇతర ప్రాంతాల వారు తమకేంటి అనే ఆలోచనకు వచ్చారు. అయితే ఇప్పుడు దాదాపుగా నాలుగేళ్ల పాలన తర్వాత కూడా అదే అభిప్రాయం ఉండటం కష్టం. ఎందుకంటే ఏపీలో అభివృద్ది పనులు జరగడం లేదు. అమరావతిని ఉద్దేశపూర్వకంగా ఆపేసినా .. పోలవరం కూడా ఆగిపోయింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. రోడ్లు కూడా అధ్వాన్యంగా తయారయ్యాయి. చిన్న చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఇది సహజంగానే ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తోంది. పెరిగిన ధరలు.. ఇతర వ్యవహారాలు కూడా ప్రజల్లో అసంతృప్తికి కారణం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల పల్స్ తెలుసుకోవడానికి సీఎం జగన్ సంక్షేమం, మూడు రాజధానుల అంశాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తున్నారని అంటున్నారు. 


మొత్తంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చే ఎన్నికల ఎజెండాను ఖరారు చేసుకోవడంలో క్రాస్ రోడ్స్‌లో ఉన్నారు. తన పాలన.. సంక్షేమంపై ఓట్లు అడగాలా.. మూడు రాజధానులపైనా అన్నది ఆయన తేల్చుకోవాల్సి ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.