ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయి ఆరు నెలలు కావస్తోంది. ఆరు నెలల వ్యవధిలో మరోసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈనెల 24కి 6 నెలల గడువు తీరిపోతుండటంతో.. 20వతేదీనుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని అధికార వర్గాల సమాచారం. ఈ సమావేశాలు వారం రోజులపాటు కొనసాగే అవకాశాలున్నాయి. 


ముందు కేబినెట్ మీటింగ్, తర్వాత అసెంబ్లీ..
అసెంబ్లీకి ముందుగా కేబినెట్ భేటీ అవుతుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. బడ్జెట్ సెషన్ అంతా టీడీపీ ఆందోళనలతో రచ్చ రచ్చగా మారింది. ఇప్పుడు జరగబోయే సమావేశాల్లో అయినా చర్చ సజావుగా జరుగుతుందేమో చూడాలి. 


అజెండా ఏంటి..?
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశముంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఎన్నికల ఏడాది కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. బీసీ బంధు, మైనార్టీ బంధు, పోడు పట్టాల పంపిణీ, వివిధ నోటిఫికేషన్లు వంటి నిర్ణయాలతో ప్రజల్ని ఆకట్టుకోవాలని చూసింది. ఇటు ఏపీలో కూడా సేమ్ సీన్ రిపీటయ్యే అవకాశముంది. ఆ నిర్ణయాలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రకటిస్తుందని అంటున్నారు. దీనికి సంబంధించి కేబినెట్ లో చర్చిస్తారని తెలుస్తోంది. 


లండన్ నుంచి సీఎం ఎప్పుడు తిరిగొస్తారు..?
ఈ నెల 11న రాత్రి సీఎం జగన్ లండన్‌ నుంచి తిరిగి రాష్ట్రానికి వస్తారని తెలుస్తోంది. జగన్ తిరిగి వచ్చిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ ఛార్జిలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. ప్రధానంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఇందులో సమీక్ష చేపడతారు. ఇప్పటికే ఐ-ప్యాక్ ప్రతినిధులు దీనికి సంబంధించిన డేటా సిద్ధం చేశారు. ఎవరెవరు గడప గడపను ఎలా పూర్తి చేశారు, ఎవరెవరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ప్రతి ఒక్కరినీ పలకరించిన ఎమ్మెల్యే ఎవరు..? పైపైనే కార్యక్రమం చేపట్టినవారెవరు..? అనే లిస్ట్ అంతా ఐ-ప్యాక్ దగ్గర ఉంది. ఆ నివేదిక చూసి ఎమ్మెల్యేల పనితీరుని సీఎం జగన్ ఓ అంచనాకు వస్తారు. మరోవైపు పార్టీ ఇన్ చార్జ్ లు, రీజనల్ కోఆర్డినేటర్ల పనితీరుపై కూడా ఆయన సమీక్ష జరుపుతారని తెలుస్తోంది. 


కొత్త కార్యక్రమం ప్రకటిస్తారా..?
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముగించేసి, కొత్త కార్యక్రమాన్ని జగన్ ప్రకటించే అవకాశం కూడా ఉంది. రాబోయే ఎన్నికల కోసం పార్టీ తరఫున చేపట్టబోయే కొత్త కార్యక్రమంపై జగన్ వచ్చాక క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఆ కార్యక్రమంతోపాటు ఎన్నికల టార్గెట్ గా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను కూడా అసెంబ్లీలో వివరించే అవకాశాలున్నాయి. వారం రోజులపాటు అసెంబ్లీ జరపాలని ప్రాథమికంగా నిర్ణయించినా, త్వరలో అధికారిక షెడ్యూల్ వెలువడుతుంది. 


టీడీపీ వ్యూహమేంటి..?
ఎన్నికల టైమ్ దగ్గరపడుతున్న ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాలను టీడీపీ ఎలా ఉపయోగించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ ఈ సమావేశాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతుందా, లేక సభలో రభస మొదలు పెట్టి సస్పెన్షన్ వేటుతో ఎమ్మెల్యేలు బయటకొచ్చేస్తారా అనేది తేలాల్సి ఉంది. చంద్రబాబు సభకు హాజరుకారు, ఆయన లేకుండా సభలో టీడీపీ మరోసారి ఎలా వ్యవహరిస్తుందనేది చూడాలి.