AP Assembly 2022 Live Updates: ఏపీ అసెంబ్లీలో ఇవాళ సభ ఆమోదం పొందిన బిల్లులు ఇవే
నేటి (సెప్టెంబరు 21) ఏపీ అసెంబ్లీ లైవ్ అప్ డేట్స్ ఈ లైవ్ పేజీలో చూడవచ్చు. తాజా సమాచారం కోసం ఈ బ్లాగ్ ని రీఫ్రెష్ చేయండి.
1. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ సవరణ బిల్లీ 2022
2. ఏపీ లేబర్ వెల్ఫేర్ ఫండ్ రెండో సవరణ బిల్లు 2022
3. ఏపీ పేమెంట్స్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ రిమూవల్ ఆఫ్ డిస్ క్వాలిఫికేషన్ సవరణ బైల్జ్ 2022
4. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ బిల్లు 2022
5. ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ అపోయింట్మెంట్ స్ సవరణ బిల్లు 2022
6. డాక్టర్ ఎన్ఠీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సవరణ బిల్లు 2022
7. ఏపీ సీఆర్డీఏ అండ్ ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ సవరణ బిల్లు 2022
8. ఏపీ మున్సిపల్ లాస్ సవరణ బిల్లు 2022
9. ఏపీ ద్రవ్య వినిమయ బిల్లు 2022
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి అసెంబ్లీలో బిల్లు పెట్టడంతో టీడీపీ నేతలు అసెంబ్లీ బయట బిల్లు ప్రతులను తగలపెట్టారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సవరణ బిల్లుపై సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ‘‘చంద్రబాబుకు ఎన్టీఆర్ తన కుమార్తెను బహుమతిగా ఇస్తే, చంద్రబాబు వెన్నుపోటును రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే ఎన్టీఆర్ చాలా కాలం బతికి ఉండేవారు. ముఖ్యమంత్రిగా ఇంకొంత కాలం కొనసాగేవారు. బహుశా చంద్రబాబు సీఎం అయ్యేవారు కాదేమో. ఎన్టీఆర్ పై నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. ఆయనపై నాకు చంద్రబాబు కన్నా ఎక్కువ మమకారమే ఉంది. గత ప్రభుత్వ హాయంలో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ నుంచి ఎన్టీఆర్ పేరును ఎందుకు తీసేయాలని అనుకున్నారో చెప్పాలి’’ అని సీఎం జగన్ అన్నారు.
‘‘ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహనరెడ్డి గారు.. మీరు ఎంతో పెద్ద మనసుతో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకైన నందమూరి తారకరామారావు గారి పేరుతో జిల్లా ఏర్పాటు చేసి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వని గుర్తింపునిచ్చి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. నిజంగా అది ఎంతో చారిత్రాత్మకం.. విప్లవాత్మకం.. అదే జిల్లాలో ఎన్టీఆర్ గారి చొరవతోనే ఏర్పాటైన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కారణజన్ముడైన ఆ మహనీయుడి పేరే కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని మనఃపూర్వక విజ్ఞప్తి’’ అని వల్లభనేని వంశీ ట్వీట్ చేశారు.
బీసీల అన్నతి కోసమే ఎన్టీఆర్ తెదేపాను స్థాపించారని చెప్పారు. వైద్య విద్యలో సంస్కరణలు తీసుకొస్తూ వర్సిటీ స్థాపించారు, కానీ నేడు మహనీయుడు ఎన్టీఆర్ పేరు వర్సిటీకి తొలగిస్తే బీసీలు ఊరుకోరు అని ఎమ్మెల్యే అనగాని వ్యాఖ్యానించారు. ఆగ్రహం కట్టలు తెంచుకుని తాడేపల్లి ప్యాలెస్‌ను ముట్టడిస్తాంమని హెచ్చరించారు.
అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేశారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం చాలా బాధగా ఉందన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్యాఖ్యానించారు.
విజయవాడ : ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ దగ్గర పోలీసులను భారీగా మోహరించారు. టీడీపీ శ్రేణులు హెల్త్ వర్సిటీకి భారీగా చేరుకుంటున్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఇప్పటికే పలుచోట్ల టీడీపీ శ్రేణుల ఆందోళన కొనసాగిస్తున్నారు. అసెంబ్లీలోనూ ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది,
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం అసెంబ్లీలో మరింత రగడ రేపుతోంది. తొలుత ప్రారంభమైన కాసేపటికే టీడీపీ సభ్యుల ఆందోళనతో వాయిదా ఏపీ అసెంబ్లీ మళ్లీ 11 గంటలు దాటాక తిరిగి ప్రారంభం అయింది. అయినా టీడీపీ ఎమ్మెల్యేలు వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపును తీవ్రంగా వ్యతిరేకించారు. ఏకంగా పోడియం వద్దకు, స్పీకర్ కుర్చీని చుట్టుముట్టి, బిల్లు ప్రతులను చింపి స్పీకర్ మీద వేశారు. దీంతో స్పీకర్ తమ్మినేని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పీకర్ 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభం అయ్యాయి. అందులో భాగంగా శాసనసభ స్పీకర్ తమ్మినేని తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు గొడవకు దిగారు. నేడు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లు సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పేరు మార్పు అంశాన్ని టీడీపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేస్తున్నారు. అయినా వారు నిరసన మరింత ఎక్కువ చేయడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.
Background
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చేందుకు నేడు (సెప్టెంబరు 21) రంగం సిద్ధం అయింది. ఈ మేరకు సంబంధిత సవరణ బిల్లును నేడు శాసనసభలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ప్రవేశపెట్టనున్నారు. ఈ యూనివర్సిటీ పేరు మార్చేందుకు గానూ గతంలోనే మంత్రివర్గ కూడా ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.
అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పెట్టాలనే ఆలోచన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుది. 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో యూనివర్సిటీలను పరిశీలించి, వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్లుగా 1986 నవంబరు 1న ఏపీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరుతో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మరణం తర్వాత అందరి ఆమోదంతో యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టారు. పాతికేళ్లుగా ఆ పేరు అంతే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఎవరూ పేరు గురించి ఆలోచించలేదు. పేరు మార్చాలన్న ఆలోచనే ఎవరికీ రాలేదు.
అప్పట్లో విజయవాడ సిద్దార్థ మెడికల్ కాలేజీ ప్రైవేటు కాలేజీగా ఉండేది. వైద్య, దంతవైద్య, నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలైన 26 సంస్థలను కలిపి తొలుత యూనివర్సిటీ కార్యకలాపాలను మొదలుపెట్టారు. రాష్ట్రంలో వైద్యవిద్య కోర్సుల కాలేజీలు, అనుబంధ కాలేజీలు భారీగా పెరగడంతో 2000 నవంబరు 1న విశ్వవిద్యాలయాన్ని సిద్దార్థ వైద్య కాలేజీ నుంచి కొత్త బ్లాకులోకి అంటే ఇప్పుడు ఉన్న భవనంలోకి మార్చారు.
ఎన్టీఆర్ ఆ యూనివర్సిటీని స్థాపించారు కాబట్టి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1998 జనవరి 8న ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చారు. మళ్లీ 2006 జనవరి 8న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పు చేసింది. విశ్వవిద్యాలయం 25 ఏళ్ల వేడుకల సందర్భంగా ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన కుమార్తె, అప్పటి కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి 2011 నవంబరు 1న ఆవిష్కరించారు.
మొత్తానికి ఎన్టీఆర్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టాలని ఇప్పుడు జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మంత్రి వర్గం ఆమోదించడం, నేడు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడం జరుగుతోంది. అయితే, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విద్యార్థుల ఫీజులు, కౌన్సెలింగ్ రుసుములతో యూనివర్సిటీ వద్ద ఉన్న రూ.400 కోట్లను జగన్ ప్రభుత్వం ఇటీవలే మళ్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
వైఎస్ఆర్‌కు, ఎన్టీఆర్ వర్సిటీకి ఏం సంబంధం - చంద్రబాబు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్‌కు ఏం సంబంధమని నిలదీశారు. ఎన్టీఆర్ నిర్మించిన విశ్వవిద్యాలయానికి తండ్రి పేరు ఎలా పెట్టుకుంటాడని నిలదీశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాల్సిందే అని స్పష్టం చేశారు. ఉన్న సంస్థలకు పేర్లు మార్చితే పేరు రాదని, కొత్తగా నిర్మిస్తే పేరు వస్తుందని హితవు పలికారు. తెలుగు దేశం పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుందని చంద్రబాబు అన్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -