Anam Ramanarayana Reddy takes charge as AP Endowments minister | అమరావతి: గతంలో లాగే కృష్ణా, గోదావరి పవిత్ర సంగం వద్ద జల హారతులను పున: ప్రారంభించనున్నట్లు ఏపీ దేవాదాయ, ధర్మాధాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.   రాష్ట్ర సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, తదితరులతో కూడిన మంత్రుల బృందం సోమవారం సమావేశమై నిర్ణయం తీసుకోనుందని మంత్రి తెలిపారు. రూ.113 కోట్ల సి.జి.ఎఫ్.నిధులతో 160 దేవాలయాల ఆధునీకరణ చేస్తామన్నారు. ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకై ప్రస్తుతం రూ.5 వేలు ఇస్తుండగా.. ఇకనుంచి ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఏపీ సచివాలయంలో ఆయనకు కేటాయించిన ఛాంబరులో ఆదివారం నాడు వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య కుటుంబ సభ్యులతో కలిసి ఛాంబరులోకి మంత్రి ఆనం ప్రవేశించారు. దేవదాయ శాఖ కమిషనర్  ఎస్.సత్యనారాయణ, ఇతర అధికారులు పుష్పగచ్చాలు అందజేసి మంత్రికి ఘన స్వాగతం పలికారు.


ఆలయాల అభివృద్ధికి నిధులపై సంతకాలు
అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ‘రెవిన్యూ సదస్సుల్లో దేవాదాయ భూములపై కూడా ఫిర్యాదులు స్వీకరిస్తాం. దేవాదాయ భూముల పరిరక్షణకు ప్రజలు సహకరించాలి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ దుర్గమ్మ తల్లి అంతరాలయంలో వీడియోలు తీసి పోస్ట్ చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రూ.113 కోట్ల సి.జి.ఎఫ్. నిధులతో 160 దేవాలయాల ఆధునీకరణ పనుల ఫైల్ పై సంతకం చేశా. మరొకటి తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నున్న శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయాన్ని రూ. 1 కోటి సి.జి.ఎఫ్. నిధులతో ఆధునీకరణ పనుల ఫైళ్లపై సంతకం చేశా. ఆ దేవాలయాల్లో 147 ప్రాధాన్యత దేవాలయాలు మైదాన ప్రాంతాల్లో ఉండగా, మిగిలిన 13 ఆలయాలు వెనుకబడిన, గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయని’ మంత్రి తెలిపారు. 


‘సీఎం చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి కోసం అడుగులు వేస్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతాం. భగవంతుని ఆస్తులను పరిరక్షించేందుకు సిద్ధంగా ఉండటమే నా ప్రథమ బాధ్యత, కర్తవ్యం. గత ప్రభుత్వ పాలనలలో తిరుమల నుంచి ఉత్తరాంద్రలోని అరసవిల్లి వరకూ దేవుని ఆస్తులను కూడా వదల్లేదు. గత ఐదేళ్లలో ఏం జరిగిందో నివేదికలు తెప్పించుకుని చర్యలు చేపడతాం. నెల్లూరు జిల్లాలో 2 ఆలయాలకు సంబంధించి విచారణ జరిపించి, ప్రాథమిక నివేదిక ఆధారంగా అందుకు బాధ్యులైన ఐదుగురు అధికారులని సస్పెండ్ చేశాం. సమగ్ర విచారణలో ఏ తప్పులు జరుగలేదని తేలితే సస్పెన్షన్ ఎత్తివేస్తాం. దేవాదాయ శాఖలోని ఒక అధికారిణి సహాయంతో కొందరు ప్రతిపక్ష ఎంపీలు, నాయకులు చేసి దురాగతాలపై విజిలెన్సు ఎంక్వరీ జరిపిస్తాం. విజిలెన్సు విచారణ సమయంలో ఆ అధికారిణిని సస్పెండ్ చేశాం. 


చంద్రబాబు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దేవాయాలను అభివృదద్ధి చేస్తామన్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ తెలుసుకున్న అంశాలు, ఆయనకు వచ్చిన వినతులకు అనుగుణంగా దేవాదాయ శాఖలో చర్యలు చేపట్టినట్లు తెలిపారు.  దేవాదాయ శాఖ అదీనంలో మొత్తం 27,105 దేవాలయాలున్నాయి. వీటిలో 6(ఎ) ఆలయాలు 236 ఉన్నాయి. ఈ శాఖ పరిధిలో మొత్తం 4,65,000 ఎకరాల భూమి ఉంది. దేవాదాయ శాఖ పరిధిలో మొత్తం 20,839 మంది సిబ్బంది ఉండగా, మత పరంగా 11,142 మంది, పాలనా పరంగా 9,697 మంది పనిచేస్తున్నారు. మొత్తం 1,234 ట్రస్టు బోర్డులు ఉండగా, మరో 462 నూత బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. 


ధూప దీప నైవేద్యాలకు రూ.10 వేలు
రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో 50 వేల లోపు ఆదాయం ఉన్న ఆలయాలకు ప్రతి నెలా రూ.5 వేలు ఇస్తుంటే, ఎన్నికల హామీ మేరకు రూ.10 వేలకు పెంచుతామన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు ఆమోదం కోసం పంపినట్లు తెలిపారు. త్వరలోనే జి.ఓ. కూడా జారీ చేస్తామని, తద్వారా ప్రతి ఏడాది దాదాపు రూ.32 కోట్లు అదనపు భారం దేవాదాయ శాఖ మీద పడుతుందని చెప్పారు.


Also Read: Tirumala: నారాయణగిరి శ్రీవారి పాదాలకు తిరుమంజనం, ప్రత్యేకత ఏంటంటే