Amravati News:  జీపీఎస్ పై ఉద్యోగ సంఘాలతో చర్చలను సీపీఎస్ ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నాయి. ముఖఅయంగా జేఏసీలో నలుగురు నాయకులు కట్టప్పలుగా మారి ఉద్యమాన్ని అమ్మేశారంటూ ఏపీ సీపీఎస్ఈఏ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజేశ్వర రావు ఫైర్ అయ్యారు. సర్కారు పదవుల కోసం ఆశపడి జేఏసీ నాయకులు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. గత సర్కారులో ఇద్దరే కట్టప్పలు ఉండేవారని, కానీ ఇప్పుడు మాత్రం నలుగురు కట్టప్పలు తయారు అయ్యారని చెప్పుకొచ్చారు. వారి వల్ల తమకు తీవ్ర స్థాయిలో నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేసే విధంగా వై నాట్ ఓపీఎస్ పేరిట నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. జేఏసీలో ఉన్న ప్రధాన సంఘాల నాయకులను తాము ఛలో విజయవాడకు ఆహ్వానించలేదని వ్యాఖ్యానించారు. వారు రావడం వల్ల తమకు నష్టం జరుగుతుందనే పిలవలేదని వెల్లడించారు. ఉద్యోగ సంఘాల నాయకులతో తాము పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. జీపీఎస్ బాగుందని చెప్పిన వారికైనా డ్రాఫ్ట్ లో ఏముందో తెలుసా అని అన్నారు. 


పోరాటం, సమస్యలు తమవి అని, అయినా తమని ఆహ్వానించలేదని రాజేశ్వర రావు వెల్లడించారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని జగన్ చెప్పారన్నారు. ప్రస్తుతం దాని గురించి అడిగితే క్రిమినల్ కేసులు పెడుతున్నారని వివరించారు. మిగిలిన సంఘాలను సమావేశాలకు ఆహ్వానిస్తున్న సర్కారు తమను ఎందుకు అనుమతించట్లేదని పేర్కొన్నారు. సీపీఎస్ విధానంలో మధ్యలో డబ్బులు డ్రా చేసుకునే అవకాశం లేదన్నారు. మహానాయకుడు అని చెప్పుకునే వైఎస్ఆర్ హయాంలో ఈ చీకటి యుగం ప్రారంభమైందన్నారు. జగన్ హయాంలో ఆ యుగం కొనసాగుతోందని రాజేశ్వర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


అలాగే చర్చలకు వెళ్తున్న ఉద్యోగ సంఘాలన్నీ గతంలో జీపీఎస్ వద్దని చెప్పి.. ఇప్పుడు మళ్లీ చర్చలకు వెళ్తున్నారని సీపీఎస్ ఉద్యోగ సంఘం నేత మరియదాసు ఫైర్ అయ్యారు. జీపీఎస్ బాగుంది అనే వాళ్లు ముందుకు వాళ్లకు అమలు చేసుకొని తమకు అమలు చేసేలా చూడాలని కోరారు. ఏపీ సర్కారు ఉద్యోగుల సంఘం నాయకులు ఆస్కార్ రావు మాత్రమే జీపీఎస్ వద్దని చెప్పారని చెప్పుకొచ్చారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్.. సీపీఎస్ ను రద్దు చేస్తామని చెప్పడంతోనే గత సర్కారు ప్రతిపాదనకు అంగీకరించలేదన్నారు. ప్రభుత్వం మెప్పు కోసమే ఉద్యోగ సంఘాల నాయకులు జీపీఎస్ పై చర్చలకు హాజరయ్యారని విమర్శించారు. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఈ చర్చలను బహిష్కరిస్తున్నట్లు తెలియజేసిందని వెల్లడించారు. ఎన్నిసార్లు చర్చలు జరిపినా వాళ్లు అనుకున్నదే చేస్తారని అన్నారు.