Amaravati Railway Line : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రం ఓకే చెప్పింది. అయితే దాని రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది అనే దానిపై చాలా మందికి క్లారిటీ లేదు. వాటికి స్పష్టత ఇచ్చేలా ABP దేశం ఇస్తున్న exclusive డీటెయిల్స్ ఇవి.
57కిలోమీటర్ల పొడవు... 2047కోట్ల ఖర్చు
అమరావతికి ప్రత్యేక లైన్ 08.11.24న శాంక్షన్ అయింది. దీని పొడవు 56.53 కిలోమీటర్లు (దాదాపు 57కిలోమీటర్లు). ఈ ప్రాజెక్ట్‌కి అయ్యే ఖర్చు 2047.40కోట్లు. ఈ బడ్జెట్ మొత్తం రైల్వే శాఖ భరిస్తుంది. కానీ భూమిని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది.
ఎర్రుపాలెం నుంచి నంబూరు స్టేషన్ల మధ్య రానున్న అమరావతి రైల్వే లైన్, కొత్తగా వచ్చే స్టేషన్స్ ఇవే.
అమరావతి రైల్వే లైన్ ప్రస్తుతం మధిర -విజయవాడ లైన్‌లోని ఉన్న ఎర్రుపాలెం స్టేషన్ నుంచి విజయవాడ -గుంటూరు లైన్‌లో ఉన్న నంబూరు స్టేషన్ వరకూ సపరేట్‌గా రానుంది. ఈ లైన్ రాజధాని గ్రామాల గుండా సాగనుంది. ఎర్రుపాలెం -నంబూరు మధ్య పెదపురం, చెన్నారావు పాలెం,గొట్టుముక్కల, పరిటాల,కొత్తపల్లి, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పవరం స్టేషన్‌లు కొత్తగా ఏర్పడనున్నాయి. రాష్ట్రప్రభుత్వం కూడా దీనికి ఆమోదం తెలపడంతో భూసేకరణ జరగగానే ఈ లైన్ ఏర్పాటు పనులు ప్రారంభించనుంది రైల్వే శాఖ. ఈ లైన్ పూర్తి అయితే అమరావతి నుంచి ఎర్రుపాలెం మీదుగా హైదరాబాద్.. నంబూరు మీదుగా విజయవాడ,వైజాగ్,గుంటూరు, చెన్నై,బెంగుళూరు లాంటి మార్గాలకు కనెక్టివిటీ రానుంది.
ఎప్పటికి పూర్తవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు 2029 జనవరి కల్లా అమరావతి రైల్వే లైన్ పూర్తి కావాలని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎంత త్వరగా భూసేకరణ పూర్తి చేసి రైల్వేకి అప్పగిస్తారు అనే దానిపై ఆధారపడి అమరావతి రైల్వే లైన్ నిర్మాణం పూర్తి అవుతుందని అని నిపుణులు చెబుతున్నారు
ఇప్పటికే ప్రభుత్వంతో రైల్వే చర్చలు
ఏపీ సీఎం చంద్రబాబుతో ఇప్పటికే విజయవాడ DRM సహా రైల్వే అధికారులు పలుమార్లు భేటీ అయ్యారు. అమరావతి రైల్వే లైన్‌ఫై రాష్ట్రప్రభుత్వం, రైల్వే శాఖ క్లారిటీతో ఉన్నాయి. మరోవైపు అమరావతి రైల్వే స్టేషన్‌ను భారీగా నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నా దానికి పెద్ద ఎత్తున భూమి కావాలి. దానికోసం ప్రస్తుతం భూసేకరణ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రైల్వే లైన్ ఖర్చు మాత్రం రైల్వే శాఖదే. ఈ లైన్ మధ్య కొన్ని బ్రిడ్జ్ లు కూడా నిర్మించాల్సి ఉంటుంది కాబట్టి ఎంత త్వరగా ప్రభుత్వం భూ సేకరణ జరిపి ఇస్తే అంత త్వరగా పనులు మొదలు పెట్టడానికి రైల్వే రెడీగా ఉంది.
