Suspect arrested in Amaravati pipe burning case: రాజధాని అమరావతిలో సంచలనం సృష్టించిన వరుస అగ్నిప్రమాదాల కేసులో కీలక పురోగతి లభించింది. మేఘా ఇంజనీరింగ్ స్టాక్ యార్డ్‌లో పైపుల దగ్ధానికి కారణమైన వ్యక్తిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అమరావతిలోని రాయపూడి సమీపంలో ఉన్న మెగా ఇంజనీరింగ్ స్టాక్ యార్డ్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించి పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 23వ తేదీ రాత్రి నిల్వ ఉంచిన పీఎల్‌బీ పైపులకు నిప్పు పెట్టింది అక్కడ పనిచేస్తున్న వాచ్‌మెన్ రాము అని పోలీసులు నిర్ధారించారు. సాంకేతిక ఆధారాలు, ప్రాథమిక విచారణ అనంతరం రామును అరెస్ట్ చేసిన పోలీసులు, అతడిని తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా రామును విచారించారు. ఈ విచారణలో భాగంగా పోలీసులు నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రీ-క్రియేట్ చేశారు. మంటలు ఎలా మొదలయ్యాయి, ఏ విధంగా వ్యాపించాయి అనే అంశాలను శాస్త్రీయంగా విశ్లేషించారు. ఈ పైపులు సాధారణంగా 130 నుండి 150 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే తప్ప మండిపోవని, కాబట్టి ఇది కచ్చితంగా మానవ ప్రేరేపిత చర్యేనని నిపుణులు తేల్చారు. నిందితుడు రాము స్వయంగా నిప్పు పెట్టాడా లేక దీని వెనుక ఎవరిదైనా రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
*మంత్రి నారాయణపై చంద్రబాబు ఆగ్రహం
మరోవైపు, అమరావతిలో వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేబినెట్ సమావేశం , భద్రతా సమీక్షలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ ను ఆయన గట్టిగా ప్రశ్నించారు. రాజధానిలో వేల కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల పనులు జరుగుతున్నప్పుడు, నిర్లక్ష్యం వహించడంపై మండిపడ్డారు. ఇప్పటికే మూడుసార్లు అగ్నిప్రమాదాలు జరిగినా మున్సిపల్ శాఖ నిమిత్తమాత్రంగా ఎందుకు వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. స్టాక్ యార్డుల వద్ద కనీస భద్రత, సీసీటీవీ కెమెరాలు లేకపోవడంపై మంత్రిని నిలదీశారు. సంబంధం లేనట్లుగా కూర్చుంటే కుదరదని, అధికారులను సమన్వయం చేసుకుని విచారణ జరిపించాలని ఆదేశించారు. రాజధాని పనులను అడ్డుకోవడానికి, ప్రభుత్వంపై అప్రతిష్ట తీసుకురావడానికి ఎవరో కావాలని చేస్తున్న విద్రోహ చర్యలుగా వీటిని అనుమానిస్తున్నట్లు సీఎం తెలిపారు.
ఈ ఘటనల నేపథ్యంలో అమరావతి రాజధాని ప్రాంతంలో హై-అలర్ట్ ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండటానికి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు
1. రాజధాని అంతటా మరియు మెటీరియల్ యార్డుల వద్ద తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.2. పోలీసు పెట్రోలింగ్‌తో పాటు డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంచాలి.3. నిర్మాణ సంస్థలు తమ సొంత సెక్యూరిటీని పెంచుకోవాలని, భద్రతలో విఫలమైతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ప్రస్తుతం అరెస్టయిన రాము ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ కుట్రలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని పోలీసులు 24 గంటల్లోగా తేల్చనున్నారు.
