ACA Mentor Mithali Raj: ఆంధ్రప్రదేశ్‌ క్రీడా రంగంలో, ముఖ్యంగా క్రికెట్‌లో  సంచలన మార్పులు దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకునేలా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడుగులు వేస్తోంది. విజయవాడ వేదికగా ఏసీఏ నూతన అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకే మార్పునకు సంకేతాలు ఇచ్చింది. ఏసీఏ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌, సెక్రటరీ సానా సతీష్‌ నేతృత్వంలో ఆంధ్ర క్రికెట్‌ను సమూలంగా ప్రక్షాళన చేస్తూ అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులను తీసుకెళ్లేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. 

Continues below advertisement

విశాఖ నుంచి మంగళగిరి వరకు మౌలిక వసతుల కల్పన 

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ గతేడాది కాలంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు చేపట్టిందని కేశినేని చిన్ని తెలియజేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో మార్పులు కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. 

విశాఖ స్టేడియం పునరుద్ధరణ: ఆంధ్ర గడ్డపై అంతర్జాతీయ క్రికెట్‌కు చిరునామా అయిన విశాఖ స్డేడియాన్ని సరికొత్తగా తీర్చి దిద్దుతున్నారు. స్టేడియంలోని ఛైర్స్‌ను మార్చడంతోపాటు ప్రధాన మైదానం తరహాలోనే బి గ్రౌండ్‌ను కూడా అత్యాధునిక రెస్ట్ రూమ్స్‌, వసతులు కల్పించబోతున్నారు. 

Continues below advertisement

మంగళగిరి స్పోర్ట్స్ సెంటర్‌: మంగళగిరి స్టేడియాన్ని కేవలం క్రికెట్‌ మైదానంగానే కాకుండా ఒక పూర్తి స్థాయి స్పోర్ట్స్ సెంటర్‌గా మార్చాలని ఏసీఏ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భవిష్యత్‌లో రాష్ట్ర క్రీడాకారులకు కేంద్ర బిందువుగా మారనుంది. 

మూలపాడుకు ఆధునిక హంగులు 

బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ ఏ స్థాయిలో శిక్షణ అందిస్తోందో, అదే తరహాలో మూలాడును అభివృద్ధి చేయబోతున్నట్టు చిన్ని వెల్లడించారు. 

రాయలసీమ అభివృద్ధి: కడప స్టేడియంలో గతంలో మౌలిక వసతుల కొరత ఉండేదని గుర్తించిన ఏసీఏ అక్కడ క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా గదులు నిర్మాణం చేపడుతోంది. 

మిథాలీ రాజ్‌- గ్యారీ స్డీడ్‌ రాక 

ఆంధ్ర క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే నిర్ణయం తీసుకుంది ఏసీఏ, మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీరాజ్‌ను ఆంధ్ర మహిళా క్రికెట్ జట్టుకు మెంటార్‌గా నియమించబోతున్నట్టు ఏసీఏ ప్రకటించింది. ఇది రాష్ట్రంలోని మహిళా క్రీడాకారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందనడంలో సందేహం లేదని అంటున్నారు. అంతే కాకుండా ఆంధ్ర రంజీ, సీనియర్‌ జట్లకు అంతర్జాతీయ కోచింగ్ అనుభవాన్ని అందించేందుకు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు ప్రముఖ కోచ్ గ్యారీ స్టీడ్‌ను రంగంలోకి దించుతున్నారు. ఒక విదేశీ కోచ్ నేతృత్వంలో ఆంధ్ర క్రీడాకారులు శిక్షణ పొందడం వల్ల వారి టెక్నిక్ అంతర్జాతీయ స్థాయికి చేరుతుందని భావిస్తున్నారు. 

ఏసీఏ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గడిచిన ఏడాది కాలంలో అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ మ్యాల్‌లు నిర్వహించామన్నారు. ఉమెన్ వరల్డ్ కప్ మ్యాచ్‌ల నిర్వహణ ఏసీఏ సమర్థతకు నిదర్శనంగా చెప్పుకొచ్చారు. మహిళా క్రీడాకారులను గౌరవించే క్రమంలో స్టేడియం రెండు ప్రధాన ద్వారాలకు మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టినట్టు గుర్తు చేశారు. త్వరలోనే రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన మహిళా క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. 

గ్రామీణ ప్రతిభ గుర్తించేందుకు రూరల్ టాలెంట్‌సెర్చ్‌ 

క్రికెట్ కేవలం నగరాలకే పరిమితం కాకుండా పల్లెటూళ్లకు కూడా విస్తరించాలని ఏసీఏ మరో ప్రోగ్రామ్ చేపట్టనుంది. రూరల్ టాలెంట్ సెర్చ్ పేరుతో కార్యక్రమం చేపట్టనుంది. వారికి ప్రత్యేక కోచింగ్ క్యాంపులు నిర్వహించనున్నారు. అదనంగా అండర్‌ -14 విభాగంలో కూడా టాలెంట్‌ హంట్‌ నిర్వహించి చిన్న వయసులోనే క్రీడాకారులను గుర్తించనున్నారు.