Mangalagiri Politics :  వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేయనున్న నియోజకవర్గంపై  వైసీపీ ఎక్కువ దృష్టి పెట్టింది. తాజాగా దొంతిరెడ్డి వేమారెడ్డిని మంగళగిరి వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు.  వేమారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఏర్పాటు నాటి నుండి నేటి వరకు అధినేత కు నమ్మిన వ్యక్తిగా వేమారెడ్డి నడుచుకుంటున్నారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కాకముందు ఆయన తాడేపల్లి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా  పని చేశారు. అయితే మంగళగిరి నియోజకవర్గ శాసన సభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డితో సరిపడకపోవడంతో కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటున్నారు.                


ఎమ్మెల్యే ఆళ్లను వ్యతిరేకించే వేమారెడ్డి                


ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా ఉండటంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. దీంతో వేమారెడ్డిని వైసీపీ హైకమాండ్ ప్రోత్సహిస్తోంది.  అందులో భాగంగానే వేమారెడ్డికి నగర పాలక సంస్ద పరిధిలో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలను అప్పగించారు.  దొండి రెడ్డి వేమారెడ్డి పార్టి కోసం అహర్నిశలు పని చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆర్దికంగా కూడ పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్నారన్న సానుభూతి ఉంది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ తో నడిచారు.


జగన్ పాదయాత్రకు ఏర్పాట్లు చేసిన వేమారెడ్డి               


జగన్ పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరిగిన సందర్బంలో   వేమారెడ్డి  ఏర్పాట్లు చేశారు. చివరకు పార్టీ అధికారంలోకి రావటంతో ఆయనకు ఎమ్మెల్సీ స్దానం దక్కుతుందని  ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్యే ఆర్కే తనకు పోటీ అవుతారనే అభిప్రాయంతో బీసీ వర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ పదవి వచ్చేలా చేశారని అంటున్నారు.  దొంతిరెడ్డి వేమారెడ్డిని యాక్టివ్ చేస్తూ   జగన్ తీసుకున్న నిర్ణయంతో సొంత పార్టీలోనే వివిధ రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కు చెక్ పడినట్లేనని చెప్పుకుంటున్నారు.  ఆర్కే విముక్త మంగళగిరి లక్ష్యంగా పని చేస్తున్న స్వపక్ష విపక్ష, శక్తులకు వేమారెడ్డి రాక తో ఉత్సాహం వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


ఆర్కేకు చెక్ పెట్టడానికే వేమారెడ్డికి ప్రాధాన్యం !               


శాసన సభ్యుడుగా ఉన్న ఆర్కే పై పెరిగిన వ్యతిరేకతతో అప్రమత్తమైన వైఎస్ఆర్ కాంగ్రెస్   ఆధిష్టానం ఈ ని ర్ణయం తీసుకుందంటూ సొంత పార్టిలోనే ప్రచారం జరుగుతుంది.మంగళగిరి నియోజకవర్గ వైకాపా రాజకీయ స్దితిగతులపై ఎంపి ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి, పరిశీలకులు నిమ్మకాయల రాజనారాయణల పరిశీలించారని అంటున్నారు. మరో వైపున మంగళగిరి నియోజకవర్గంలో తెలుగు దేశం నియోజకవర్గ ఇంచార్జ్ గా నారా లోకేష్ రేసులో ఉన్నారు. ఆయనకు చెక్ పెట్టేందుకు కొత్త సమీకరణాలు ప్రయత్నిస్తున్నారు.