1998 డీఎస్సీ అభ్యర్థులు ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. తమ పాతికేళ్ల కలను నెరవేర్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం తెలిసి తమ ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులు చాలా ఆనందంగా ఉన్నారని తెలియజేశారు.
1998 డీఎస్సీలో వివిధ కారణాలతో ఉద్యోగాలు పొందలేకపోయామని... ఈసారి అధికారంలోకి వస్తే కచ్చితంగా తమ సమస్యను పరిష్కరించాలని పాదయాత్రలో జగన్‌కు వీళ్లంతా గోడు వెల్లబోసుకున్నారు. దీంతో ఈ సమస్యపై దృష్టి పెట్టిన సీఎం జగన్.. కోర్టు తీర్పునకు అనుగుణంగా 1998 డీఎస్సీ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కలిసిన వారిలో 1998 డీఎస్సీ అభ్యర్థులతోపాటు ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ఉన్నారు.
1998 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వలన్న నిర్ణయంతో చాలా మందికి ఆశలు చిగురించాయి. అలా ఉద్యోగం రాదు... ఇక జీవితమే లేదను భావించిన అల్లక కేదారేశ్వరరావు... ప్రభుత్వ నిర్ణయంతో స్టార్ అయిపోయారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన ఈయన చేనేత కార్మికుల కుటుంబంలో జన్మించారు. చాలా ఏళ్ల కిందటే డిగ్రీ పూర్తి చేశారు. టీచర్ కావాలన్న లక్ష్యంతో అన్నా మలై విశ్వవిద్యాలయం నుంచి బీఈడీ కూడా చేశారు. 1994 డీఎస్సీలో కొన్ని మార్కుల తేడాతో జాబ్ రాలేదు. అయినా నిరుత్సాహ పడకుండా 1998లో డీఎస్సీ రాశారు. క్వాలిఫై అయినా రిక్రూట్‌మెంట్ వివాదం కోర్టుకు చేరడంతో అభ్యర్థుల ఎంపిక నిలిచిపోయింది. ఏళ్లు గడిచినా ప్రయోజనం లేకపోయంది. కానీ తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయంతో ఆశలు చిగురించాయి. 1998 డీఎస్సీ క్వాలిఫై అభ్యర్థులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని గ్రామస్తులు తెలపడంతో ఆయన చాలా ఆశ్చర్యపోయారు. బిక్షాటన చేస్తూ జీవితంపై తీవ్ర నిరాశతో ఉన్న సమయంలో ఉద్యోగాలపై సీఎం ప్రకటన రావడంతో ఎలా స్పందించాలో కూడా ఆయనకు అర్థం కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
1998 డీఎస్సీ అభ్యర్థుల్లో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఉన్నారు. 23 ఏళ్ల తర్వాత ఉపాధ్యాయుడిగా ఆయన కూడా ఎంపికయ్యారు. సీఎం జగన్ తాజాగా సంతకం చేసిన జాబితాలో కరణం ధర్మశ్రీ పేరు కూడా ఉంది. బీఏ సోషల్, ఇంగ్లిష్ పోస్టుకు ధర్మశ్రీ 1998లో డీఎస్సీ రాశారు. కోర్టు వివాదాల కారణంగా 1998 డీఎస్సీ అభ్యర్థులకు అప్పట్లో ఉద్యోగాలు ఇవ్వలేదు. అనంతరం కరణం ధర్మ శ్రీ రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగంలో ఆయన పనిచేశారు. మాడుగుల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారి 2004లో గెలిచారు.