కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా కాలం తర్వాత ఏపీ పర్యటనకు వచ్చారు. ఆయనది వ్యక్తిగత పర్యటనే అయినప్పటికీ ఆయన టూర్‌పై రాజకీయవర్గాల్లో చాలా ఆసక్తి ఏర్పడింది. అయితే ఎక్కడా రాజకీయ అంశాలకు ప్రాధాన్యత లేకుండా  శ్రీశైలంలో స్వామి వారి దర్శనం చేసుకుని వెళ్లిపోయారు. అయితే ఆయన అలా వెళ్లిపోయిన కాసేపటి తర్వాత ప్రభుత్వం హోంమంత్రి అమిత్‌షాను సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని .. ఆయనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదన్న విమర్శలు సోషల్ మీడియాలో ప్రారంభమయ్యాయి. దీనికి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని కలిపి చెప్పడం ప్రారంభించారు. 


ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించడానికి పెట్టిన ప్రెస్‌మీట్‌లోనే మంత్రి పేర్ని నాని తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆ తర్వాత వారికి బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో ప్రభుత్వ పరంగా చేసిన అప్పుల విషయంపై కేంద్రం చాలా సీరియస్‌గా ఉందని..  లెక్కలన్నీ తీస్తోందని మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ అప్పులపైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .. భారతీయ జనతా పార్టీపై ఎదురుదాడి చేస్తోంది. ఇలాంటి  పరిస్థితుల్లో అమిత్ షా ఏపీ పర్యటనకు వచ్చారు. 


కేంద్ర హోంమంత్రికి ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన మర్యాదలన్నింటినీ ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. ఎక్కడా లోటు రానీయలేదు. స్థానిక ఎంపీతో పాటు కలెక్టర్ ఇతర అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయంలో దర్శనాలు.. ప్రత్యేక పూజలు చేయించారు. అంతే సాదరంగా వీడ్కోలు పలికారు. అయితే... అమిత్ షా కేవలం హోంమంత్రిగా మాత్రమే ట్రీట్‌చేయడం సరి కాదని .. సీఎం జగనే దేశంలో రెండో అత్యంత పవర్‌ఫుల్‌ అని స్వయంగా చెప్పిన విషయాన్ని కొంత మంది గుర్తు చేస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రోటోకాల్ ఏర్పాట్లు అంచనాలకు తగ్గట్లుగా లేవన్న అభిప్రాయానికి వస్తున్నారని అంటున్నారు. 


అయితే హోంమంత్రి పర్యటన విషయంలో చాలా ప్రోఫైల్ పాటించాలని ముందుగానే నిర్ణయించారని.. అందుకే కేంద్ర హోంశాఖ నుంచి ఎలాంటి హడావుడి ఉండకూడదన్న చాలా స్పష్టమైన సందేశం రాష్ట్ర ప్రభుత్వ వర్గాలకు వచ్చాయని అంటున్నారు. అందుకే పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం కూడా కూల్‌గా.. కామ్‌గా జరిగిపోయేలా చూసిందని అంటున్నారు. అయితే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల కారణం అమిత్ షా పర్యటనకు ఎలాంటి హడావుడి జరగకపోడంతో అది వైసీపీ, బీజేపీ మధ్య పెరుగుతున్న దూరానికి సాక్ష్యంగా విశ్లేషించుకోవడం వల్లే పట్టించుకోలేదన్న అభిప్రాయం వస్తుందని అంటున్నారు.