Amit Shah AP Politics : ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల అంశం త్వరలోనే కొలిక్కి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. డిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేషనల్ డెమెక్రటిక్ అలయెన్స్ విస్తరణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్యామిలీ ప్లానింగ్ విధానాన్ని తాము నమ్మబోమని చమత్కరించారు. అంటే.. ఎన్డీఏలో చేరాలనుకున్న పార్టీలను ఆహ్వానిస్తామని ఆయన చెప్పినట్లయింది. తమ మిత్రులను తామ ఎప్పుడూ దూరం చేసుకోలేదని.. దూరమైన వాళ్లు.. వారి వారి రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా దూరయ్యారని అంటున్నారు. ఏపీలో పొత్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలా ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్నాయి. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల కిందట టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు.. అమిత్ షా తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. అమిత్ షా ఇంట్లో జరిగిన ఈ సమావేశం తర్వాత అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఎన్డీఏలో టీడీపీ చేరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో .. వైసీపీ అధినేత జగన్ కూడా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో సమావేశయ్యారు. ఆయన కూడా ఎన్డీఏలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఒకే రాష్ట్రానికి చెందిన రెండు పార్టీలు ఒకే కూటమిలో భాగస్వామ్యం అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించాలా.. వైఎస్ఆర్‌సీపీని ఆహ్వానించాలా అన్నదానిపై బీజేపీ హైకమాండ్ పరిశీలన జరుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఏ పార్టీతో వెళ్తే మెరుగైన సీట్లు వస్తాయి.ఏ పార్టీతే వెళ్తే దీర్ఘ కాలిక ప్రయోజనాలు ఉంటాయో అంచనా వేసుకుని ఆ పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నిజానికి ఏపీలో బీజేపీకి ఉన్న బలం ఒకటి.. రెండు శాతం ఓట్లే. ఆ మాత్రం ఓట్ల బలానికి పొత్తులు పెట్టుకోమని పార్టీ వెంటపడవు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా.. మూడో సారి కూడా గెలుస్తుందన్న అభిప్రాయం గట్టిగా ఏర్పడిన సందర్భంగా బీజేపీ అండ ఉండాలని కోరుకుంటున్నారు. ఈ కారణంగానే ఏపీలో రాజకీయ పార్టీలన్నీ బీజే్పీ తో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నాయి.
నిజానికి ఏపీలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అయ్యాయి. టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు చర్చలు దాదాపుగా పూర్తి చేసుకున్నాయి. కానీ బీజేపీ కూటమిలోకి వస్తుందన్న కారణంగానే ప్రకటన ఆగిపోయింది. వచ్చే నెల ఎన్నికల షెడ్యూల్ విడదలయ్యే అవకాశం ఉండటంతో.. బీజేపీ త్వరలోనే తమ విధానాన్ని స్పష్టం చేస్తుందని రాజకీయ పార్టీల నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు.