Megastar Special Wishes To CM Chandrababu And Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం బుధవారం కొలువుదీరింది. ఆయనతో పాటు పవన్ కల్యాణ్, నారా లోకేశ్ మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా సహా ఇతర రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, సూపర్ స్టార్ రజనీకాంత్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రులు పవన్ కల్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
డిప్యూటీ సీఎం గారూ..
మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో డిప్యూటీ సీఎం గారూ అంటూ తన తమ్ముడు పవన్ కల్యాణ్‌ను పేర్కొన్నారు. 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొణిదెలపవన్ కల్యాణ్ గారికి.. మిగతా మంత్రివర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను....ఆశిస్తున్నాను.!!' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో పవన్‌ను డిప్యూటీ సీఎంగా చేస్తారని అంతా భావిస్తున్నారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి అలా ట్వీట్ చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అమిత్ షా సైతం
అటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఏపీ కొత్త ప్రభుత్వాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆయన కూడా 'ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు' అంటూ పేర్కొన్నారు. 'ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ నా అభినందనలు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడం, సీఎంగా చంద్రబాబు, మంత్రిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంతో రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని అంతా భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో టికెట్ రేట్ల పెంపు ఇతర సమస్యల పరిష్కారం కోసం జగన్‌ను సినీ పెద్దలు కలిశారు. గత ప్రభుత్వ హయాంలో పవన్ నటించిన కొన్ని సినిమాల విడుదల సమయంలోనూ ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అంతా అనుకుంటున్నారు.