Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి మరోసారి విమర్శలు గుప్పించారు. అంబటి మాట్లాడుతూ.. దొంగ అన్సి సార్లు తప్పించుకోలేడని, అది చంద్రబాబు అరెస్ట్ విషయంలో రుజువైందన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ స్కిల్‌ స్కాంలో నారా చంద్రబాబు నాయుడు రిమాండ్‌కు వెళ్లిన క్షణం నుంచి టీడీపీ, వారి ఎల్లో మీడియా రాతలు, వాదనలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. చంద్రబాబు నేరస్తుడు కాదు అని మాత్రం వాదించడం లేదు. పీసీ యాక్ట్‌ 17ఏ ప్రకారం అరెస్టు జరగలేదు అంటారు. చంద్రబాబును గవర్నర్‌ పర్మిషన్‌ తీసుకుని అరెస్ట్‌ చేయలేదు అంటారు. ఆయనకు రాచమర్యాదలు చేయడం లేదంటూ బాధపడుతున్నారు. కానీ ఏ చట్టం ముందైనా, విచారణకైనా నిలబడతాం అనే ధైర్యం మాత్రం చేయడం లేదు’ అని విమర్శించారు.
 
లొసుగులను అడ్డం పెట్టుకుని పారిపోయే యత్నం
‘చట్టంలో లొసుగులను ఉపయోగించుకుని పారిపోవాలనే చంద్రబాబు 32 రోజులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. విచారణ జరిగితే తమ బండారం అంతా బయటపడుతుందని అనే భయంతో విచారణకు సిద్ధంగా లేరు. 
ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టులో కూడా అదే వాదన చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రూ.120 కోట్లు ఆయన పీఏ ద్వారా లంచం తీసుకున్నారనే సమాచారం తమ వద్ద ఉందని, సమాధానం చెప్పాలని  ఇన్‌కం టాక్స్‌ శాఖ నోటీసులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఏనాడూ ఒప్పందం చేసుకోలేదని సీమెన్స్‌ కంపెనీ అంటోంది. రూ.3000 కోట్ల పెట్టుబడులు తాము పెట్టలేదని, ఎలాంటి సాఫ్ట్‌వేర్, పరికరాలు తమ వద్ద నుంచి వెళ్లదని సీమెన్స్ కంపెనీ స్పష్టంగా  చెప్పింది. ఈ కేసులో అడ్డంగా దొరికిన బాబు 17ఏని పట్టుకుని తప్పుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ ధ్వజమెత్తారు. 


అన్ని ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్
‘చంద్రబాబుకు కేసులు కొత్తేం కాదు. గతంలో లక్ష్మీపార్వతి, ప్రముఖ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్‌, వైఎస్‌ విజయమ్మ, ఇప్పుడు టీడీపీలో ఉన్న లక్ష్మీ నారాయణ కేసు ఫైల్‌ చేశారు. ఆధారాలతో సహా అవినీతిని కోర్టు ముందు పెడితే టెక్నికల్‌ అంశాలను చూపి మేనేజ్‌ చేసుకుని కొట్టేయించుకున్నాడు. అనేక సార్లు విచారణ నుంచి తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు చట్టాలు పకడ్బందీగా ఉన్నాయి. నేరంలో స్పష్టంగా దొరికిపోయాడు. మరో పక్క ఈడీ ఇదే కేసులో నలుగురిని అరెస్టు చేసింది. 1400 మంది సాక్షులను విచారించారు. అనేక డాక్యుమెంట్లు వారి వద్ద ఉన్నాయి. అరెస్టయిన వారు 164 స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు. అన్ని ఆధారాలు తీసుకుని చంద్రబాబు నేరం చేశారనే నిర్ణయానికి వచ్చాకే సీబీసీఐడీ ఆయన్ను అరెస్ట్‌ చేసింది’ అని అంబటి అన్నారు.


తప్పించుకునేందుకు లోకేష్ యత్నం
‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? ఆయన కుమారుడు కూడా మేశాడు. రింగు రోడ్డులో అలైన్‌మెంట్‌ ఎందుకు మార్చావు? ఎవరికి లబ్ధి జరిగిందని ప్రశ్నిస్తే లోకేష్ సమాధానం చెప్పడు. మీ హెరిటేజ్‌ భూములు అక్కడే ఎందుకు కొన్నారు చెప్పమంటే రింగ్‌ రోడ్డే లేదుగా అంటాడు. అసలు రాజధానే లేదు కదా.. అంతా గ్రాఫిక్స్‌ కదా అంటున్నాడు. చంద్రబాబు అరెస్టుతో జైళ్లో ఉన్నాడు. లోకేష్ అరెస్ట్‌ చేయకుండానే ఓపెన్‌ జైళ్లో ఉన్నాడు. మొన్నొక రోజు వచ్చి కన్పించి పోయాడు. నేడు విచారణకు హాజరయ్యాడు. విచారణలో కూడా తప్పుకుపోడానికే ప్రయత్నం చేస్తాడని భావిస్తున్నా’ అని రాంబాబు విమర్శించారు. 


పీకే కాదు కేకే.. కిరాయి కోటిగాడు
‘ఎన్టీఆర్‌ను అందరూ సమిష్టిగా వెన్నుపోటు పొడిచారు. పురందేశ్వరి కాంగ్రెస్‌ ఉన్నా, బీజేపీలో ఉన్నా ఆమె లక్ష్యం మరిదిని కాపాడడమే. టీడీపీ మొత్తాన్ని బీజేపీలో కలిపేస్తామని పురందేశ్వరి రాయబారానికి వెళ్లారు. మంత్రి రోజాపై బండారు సత్యనారాయణమూర్తి ఇష్టారీతిన మాట్లాడితే కనీసం ఖండించడానికి కూడా మనసు రాలేదు. సిగ్గుమాలిన రాజకీయాలు చేయడంలో ప్రబుద్ధుడు దత్తపుత్రుడు. ఆయన ఎవరిని కాపాడటానికి పార్టీ పెట్టాడో తెలియదు. ఆయన పీకే కాదు.. కిరాయి కోటిగాడు (కేకే). కిరాయి తీసుకుని ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. చంద్రబాబు కోసం పార్టీ పెట్టిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. ఆయన మాట్లాడే మాటలతో టీడీపీ మరింతగా పతనమయ్యే పరిస్థితి వచ్చింది.  పవన్ పార్టీ జనసేన కాదు, బాబు సేన’ అంటూ అంబటి మండిపడ్డారు.