రాయలసీమ పర్యటనలో భాగంగా పులివెందులలో నిర్వహించిన రోడ్‌ షోలో చంద్రబాబు తన స్థాయికి తగని మాటలు మాట్లాడారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. తనను ఆంబోతు రాంబాబు అంటూ కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి పైకి వచ్చాడని గతంలోనే చెప్పానని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై తానూ మాట్లాడగలనని అన్నారు. గురువారం (ఆగస్టు 3) అంబటి రాంబాబు ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు.


‘‘పోలవరం ప్రాజెక్టును 2018 కల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని అసెంబ్లీలో ఎందుకు చెప్పారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని కేంద్రమే నిర్మించి ఇస్తామంటే ఎందుకు తీసుకున్నారు? పోలవరానికి వెన్నెముక లాంటి డయాఫ్రం వాల్ ను కాఫర్ డ్యాం పూర్తి కాకుండా ఎందుకు నిర్మించారని అడిగాను. వీటికి సమాధానం చెప్పకుండా ఆంబోతు రాంబాబు అంటున్నారు. రాయలసీమలో ఏ ఒక్కప్రాజెక్టు అయినా చంద్రబాబు కాలంలో శంకుస్ధాపన, పూర్తి చేయడం జరిగిందా? తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ఎకరాకు అయినా నీరిచ్చావా? ఇవ్వలేదు. ఆ 14 ఏళ్లు ఏం చేయలేనివాళ్లు.. ఇప్పుడేం చేస్తారు. రాయలసీమ ప్రాజెక్టులు దివంగత ఎన్టీఆర్‌, వైఎఎస్ఆర్‌ చలవ వల్లే పూర్తి అయ్యాయి. 


నన్ను గోకుతున్నారు
‘‘బ్రోలో డైలాగులు, పాత్రలు పెట్టి మమ్మల్ని గోకుతున్నాడు కాబట్టి మాట్లాడుతున్నా. నా పేరు తో సినిమా క్యారక్టర్ వేసి శునాకనందం పొందుతున్నారు అందుకే నేనీ సినిమా గురించి మాట్లాడుతున్నా. పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో చెప్పాలి. బ్రో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో చెప్పాలి. బ్రో సినిమాకు పవన్ కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో నిర్మాత కూడా చెప్పాలి. ఎన్టీఆర్ రాముడు - భీముడు సినిమాలోలా పవన్ ను అంటే చంద్రబాబుకు గుచ్చుకుంటోంది. చంద్రబాబు అబద్ధాలు లై డిటెక్టర్ కు కూడా దొరకవు. రాయలసీమకు అన్నీ నేనే చేశానంటే ఈ తరం వాళ్లు నమ్మేస్తున్నారు’’ అని అంబటి రాంబాబు అన్నారు.


ఢిల్లీ ఎందుకు వచ్చారని ఎవరెవరిని కలిశారని విలేకరులు ప్రశ్నించగా, కొన్ని విషయాలను బహిరంగంగా చెప్పకూడనివి ఉంటాయని అన్నారు. కేంద్రమంత్రి షెకావత్, విజయసాయి రెడ్డిని కలిశానని, వైసీపీ ఎంపీలతో కలిసి మాట్లాడినట్లుగా అంబటి రాంబాబు చెప్పారు. షెకావత్ ను పోలవరం రమ్మని అడిగితే సాధ్యమైనంత త్వరగా వస్తానన్నారని అన్నారు. ‘‘కొట్టుకుపోయిన డయాఫ్రం వాల్ కొత్తది కట్టాలని ఆలోచన చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హాయాంలో చేసిన తప్పిదం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బ తిన్నది. కొత్తది కట్టడానికి, రిపేర్లకు దాదాపు రూ.2,500 కోట్లు ఖర్చు అవుతుంది. గైడ్ బండ్ కుంగడానికి కారణాలు తెలుసుకోవడానికి నిజనిర్ధారణ కమిటీ వేశాం’’ అని అంబటి అన్నారు.


చంద్రబాబు వ్యాఖ్యలు ఇవీ


‘‘ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు గట్టిగా మాట్లాడుతున్నాడు. నీటి పారుదల ప్రాజెక్టులపై నేను వేసిన ప్రశ్నలపై మాట్లాడకుండా.. పవన్ కల్యాణ్ బ్రో సినిమాపై ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు. నువ్వు మంత్రివా? లేదంటే బ్రో సినిమాలో యాక్ట్ చేసే బ్రోకర్ వా అని అడుగుతున్నా? హుందాతనం లేదు. పద్ధతి లేదు. మీరు ఒక సైకోని ఇచ్చారు. ఆయన సైకోల్ని తయారు చేస్తున్నాడు’’ అని చంద్రబాబు అన్నారు.