Ambati Rambabu released from Rajahmundry jail: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సుమారు 19 రోజుల జైలు జీవితం తర్వాత బుధవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసుతో పాటు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న కేసుల్లో ఆయనపై పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. వరుసగా ఈ మూడు కేసుల్లోనూ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది.
జైలు నుంచి బయటకు రాగానే అంబటి రాంబాబుకు వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తనను జైలు నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించిందని, వరుస కేసులు పెట్టి వేధించిందని ఆరోపించారు. నన్ను 18 రోజులు జైల్లో పెడితే భయపడతానని అనుకున్నారు, కానీ రాజమండ్రి జైలు నా పట్టుదలకు శిక్షణగా మారింది అంటూ వ్యాఖ్యానించారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసులు బనాయించారని, తన ఇంటిపై దాడులు చేసి తన భార్య, పిల్లలను ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను జైలులో పెట్టి, నేరస్తులను బయట తిరగనిస్తున్నారని విమర్శించారు. ప్రజలు, ధర్మం నా వెంటే ఉన్నాయి.. పైన దేవుడున్నాడు, అన్నింటికీ ఒకరోజు సమాధానం చెబుతాను అని ఆయన పేర్కొన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రజాక్షేత్రంలో పోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కూటమి ని కూల్చేంత వరకూ పోరాడతానని అన్నారు.
జనవరి 31న అరెస్ట్ అయిన అంబటి, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జైలుకు వెళ్లడం ఇదే తొలిసారి. ఆయన జైలులో ఉన్న సమయంలో పలువురు పార్టీ నేతలు పరామర్శించారు. విడుదల అనంతరం ఆయన భారీ ర్యాలీగా బయలుదేరారు. గురువారం ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉంది.