Ambati Rambabu granted bail in lucky draw case : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న కేసులో గుంటూరు కోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అంబటిని విచారించేందుకు పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కూడా న్యాయమూర్తి తోసిపుచ్చారు.
జనవరి 31 నుంచి జైల్లో అంబటి రాంబాబు
అంబటి రాంబాబు జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తొలుత ఆయన అరెస్ట్ అయ్యారు. ఆ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న మరో కేసులో పీటీ వారెంట్‌పై ఆయనను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.తర్వాత ఆ కేసులోనూ బయిల్ వచ్చింది.
మరో కేసులో పీటీ వారెంట్ జారీ చేయకపోతే విడుదల
ఇప్పటికే చంద్రబాబును దూషించిన కేసు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసుల్లో అంబటికి బెయిల్ లభించింది. అయితే, సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా కేసులో పీటీ వారెంట్ పెండింగ్‌లో ఉండటంతో ఆయన జైలులోనే కొనసాగాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ మూడో కేసులో కూడా బెయిల్ మంజూరు కావడంతో ఆయన విడుదలకు ఉన్న ప్రధాన చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.
గురువారం ఉదయం విడుదలయ్యే అవకాశం
ప్రస్తుతానికి అంబటిపై ఇతర పీటీ వారెంట్లు ఏవీ పెండింగ్‌లో లేవని సమాచారం. కోర్టు జారీ చేసిన బెయిల్ ఆర్డర్లు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు అందిన వెంటనే అధికారిక ప్రక్రియ పూర్తి చేసి ఆయనను విడుదల చేసే అవకాశం ఉంది. అన్నీ సవ్యంగా జరిగితే బుధవారం రాత్రికి లేదా గురువారం ఉదయానికి అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని ఆయన తరపు న్యాయవాదులు భావిస్తున్నారు. బెయిల్ వచ్చిందని తెలియగానే ఆయన ట్వీట్ చేశారు. కూటమిని కూల్చేవరకూ పోరాడతానన్నారు.