Ysrpc : వైసీపీలో జరిగిన మార్పులు మరోసారి ఏపీ రాజకీయవర్గాల్లో హాట్‌ టాపిక్‌ గా మారాయి. జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్‌ పదవుల మార్పు ముందే ఊహించిందా? లేదంటే పార్టీ అధ్యక్షుడి హెచ్చరికల నేపథ్యంలో జరిగిందా? అన్నది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఈ మార్పు ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతోందన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో బంధాలు, అనుబంధాలు అలాగే మిత్రులు, శత్రువులు అనే మాటలు ఉండవన్న విషయం మరోసారి వైసీపీ నిరూపించింది. జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కోఆర్డినేటర్‌ పదవుల విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు ఉదాహరణగా నిలిచాయి. ఎవరూ ఊహించని విధంగా ఈ మార్పులు జరగడం ఆపార్టీ నేతలనే కాదు రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఏ కోణంలో జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారన్నది చర్చనీయాశంగా మారింది. గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించిన వైసీపీ ఈసారి ఏపీలో అన్ని స్థానాలను అంటే 175 సీట్లను కైవసం చేసుకొని ప్రతిపక్షం లేకుండా చేయాలన్నది ఆపార్టీ అధినేత లక్ష్యం. ఈ విషయాన్ని ఎప్పుడో పార్టీ నేతలకు స్పష్టం కూడా చేశారు. అందులో భాగంగానే ఇంటింటికి మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మంత్రులు, పార్టీ నేతలందరినీ ప్రజల మధ్యలో ఉండేలా చేస్తున్నారు. 


ప్రజల మద్దతు ఉన్న వారికే టికెట్లు 


అయితే జగన్‌ ఆశించిన స్థాయిలో పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదు. వివిధ కారణాలతో తప్పించుకోవడం లేదంటే కుటుంబసభ్యులతో మమ అనిపించడం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ అధినేత జగన్‌ పార్టీ మీటింగ్‌ లో ఈ తరహా వ్యవహారాలు తన దగ్గర కుదరదని స్ఫష్టం చేయడమే కాదు పనిచేసే వారికే పార్టీలో పదవులు ఉంటాయని ప్రకటించారు. అంతేకాదు ప్రజల మద్దతు ఉన్నవారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. అలా పనిచేయని వారిలో మంత్రులు కూడా ఉన్నారు. వారిని సైతం హెచ్చరించారు. అయితే జగన్‌ మాటలను పార్టీ శ్రేణులు సీరియస్‌ గా తీసుకోలేదు. 


సర్వేల ఆధారంగా 


జిల్లాలో ఆధిపత్యం కోసం పోరు, కిందిస్థాయి నేతలతో సమన్వయం లేకపోవడం, కార్యకర్తలకు దూరంగా ఉండటం , ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించలేకపోవడం  వంటి పలు విషయాలను జగన్‌ పరిగణలోనికి తీసుకున్నారు. ఫలితంగానే ఈ మార్పులు అని ఇన్‌ సైడ్‌ టాక్‌. మాజీ మంత్రులు అనిల్‌, సుచరితలతో పాటు పలువురు కీలక నేతలకు సైతం జగన్‌ షాకివ్వడంతో పార్టీ శ్రేణుల్లో టెన్షన్‌ నెలకొంది. త్వరలోనే మళ్లీ క్యాడర్‌ తో జగన్‌ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ లోపు నేతల్లో మార్పు వస్తే సరే లేదంటే ఇక దూరం పెట్టేసే ఆలోచనలో ఉన్నారట. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థిని ప్రకటిస్తానని ఇంతకుముందే స్పష్టం చేసిన జగన్‌ ఇప్పుడు ఆ మాటకే కట్టుబడి ఉన్నారట. అందులో భాగంగానే ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని టాక్‌. పార్టీ శ్రేణుల పనితీరుపై వచ్చిన సర్వేల ఆధారంగానే వైసీపీ అధినేత జగన్‌ ఈ మార్పులకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది.