MP Nandigam Suresh : అమరావతి ఉద్యమం 1200వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నేత సత్యకుమార్ రైతులకు సంఘీభావం తెలిపారు. ఆ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో మూడు రాజధానుల మద్దతుదారులు సత్యకుమార్ కారుపై దాడిచేశారు. వైసీపీ కార్యకర్తలే తన కారుపై దాడి చేశారని సత్యకుమార్ ఆరోపించారు. ఈ దాడిపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ స్పందించారు. మూడు రాజధానుల శిబిరంలో ఉన్న వాళ్లపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి మనుషులు దాడి చేశారని ఆరోపించారు. మహిళల మీద ఆదినారాయణ రెడ్డి మనుషులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారన్నారు. అమరావతి రైతుల శిబిరంలో ఆదినారాయణ రెడ్డి సీఎం జగన్ పై ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు. ఆదినారాయణ రెడ్డి అనుచరులు మూడు రాజధానుల టెంట్ వద్దకు వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారన్నారు. సత్యకుమార్ కారులో కూర్చొని వెకిలిగా నవ్వారని ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు.
పోలీసులు ఫిర్యాదు చేస్తాం
చంద్రబాబు డైరెక్షనులో ఆదినారాయణ రెడ్డి మూడు రాజధానుల శిబిరంపై దాడికి పాల్పడిందని నందిగం సురేష్ అన్నారు. అసలు గొడవకు మూలకారణం ఆదినారాయణ రెడ్డి అన్న ఆయన...సత్యకుమార్ అనవసరంగా ఈ వ్యవహారాన్ని తనపై వేసుకుంటున్నారన్నారు. అమరావతి రైతులు శిబిరం వద్దకు మేమేనాడైనా వెళ్లామా అని పశ్నించారు. ఈ దాడి పథకం ప్రకారం జరిగిందని, వాళ్లే మనుషులతో వచ్చి కవ్వించారన్నారు. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలు నిగ్గు తేల్చాలన్నారు.
బీజేపీ నేతలు ఆగ్రహం
ఈ దాడిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సత్యకుమార్ పై జరిగిన దాడిని ఖండించారు. బీజేపీ నేతలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలన్నారు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపినందుకు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ నేతలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
బహిరంగ దాడులు కలకలం
అమరావతి రాజధాని ప్రాంతంలో బీజేపీ నేతలపై దాడి జరగటంతో కాషాయ దళం మండిపడుతోంది. బహిరంగంగా భారతీయ జనతా పార్టీ నేతల పై జరిగినన దాడిని అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తప్పు పట్టారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడి వ్యవహరం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. తనపై జరిగిన దాడి ఘటనపై సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. అమరావతి ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా నిర్వహించిన సభలో భారతీయ జనతా పార్టికి చెందిన నాయకులు పాల్గొన్నారు. అమరావతి రైతులకు మద్దతుగా సభలో పాల్గొని ప్రసంగించిన కాషాయ దళం నేతలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకొని ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస వికృత క్రీడ గురించి తాను మాట్లాడానని, అయితే అధికారంలో ఉన్న పార్టి నేతలయినా అమరావతి రాజధాని గురించి ఎందుకు మాట్లాడరని సత్యకుమార్ ప్రశ్నించారు.