Sajjala On Mlc Elections : వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. పలువురు అధికారుల తీరుపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన సజ్జల... టీడీపీపై విమర్శలు చేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా కూడా దబాయింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో వ్యవస్థలను తొక్కిపెట్టారని ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసిందని విమర్శించారు. మళ్లీ అధికారంలోకి రావాలనేది చంద్రబాబు ఆశ అని, ఆ ఆశలు కలలుగానే మిగులుతాయన్నారు.
వైసీపీ ఓట్లు టీడీపీకి కలిపేశారు
పశ్చిమ రాయలసీమ ఎన్నికల కౌంటింగ్ సవ్యంగా జరగలేదని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. ఒక్క బండిల్‌లో 6 ఓట్లు తేడాగా కనిపించిందన్నారు. కౌంటింగ్ సమయంలో అధికారులు కూడా భిన్నంగా వ్యవహరించారని ఆరోపించారు. వైసీపీ ఓట్లను టీడీపీ ఓట్లలో కలిపేశారన్నారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే కౌంటింగ్ అయిపోయాక అడగాలని ఆర్వో అన్నారన్నారు. రీకౌంటింగ్ చేయాలని కోరడం అభ్యర్థి హక్కు అని సజ్జల తెలిపారు. టీడీపీ ఓ వైరస్ లాంటిదని ఎద్దేవా చేశారు. అన్ని వ్యవస్థలను టీడీపీ వైరస్ చెడగొడుతుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెస్తే ఫలితాలు ఇలా ఎందుకు ఉంటాయన్నారు. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైసీపీ ఎప్పుడూ ధర్మయుద్ధమే చేస్తుందని స్పష్టం చేశారు.
కోర్టును ఆశ్రయిస్తాం
పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని వైసీపీ అభిప్రాయపడుతుందని సజ్జల తెలిపారు. ఈ ఫలితంపై అనుమానాలున్నాయని, దీనిపై కోర్టను ఆశ్రయిస్తామని సజ్జల చెప్పారు. కౌంటింగ్ లో ఉన్న అధికారుల తీరుపై అనుమానం వ్యక్తం చేశారు సజ్జల. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తామన్న ఆయన.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటుకు టీడీపీకి బలం ఉందన్నారు. ఆ పార్టీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు కాబట్టి టీడీపీ ప్రలోభాలకు పాల్పడే అవకాశాలున్నాయని సజ్జల అన్నారు.
ప్రభుత్వ వ్యతిరేకత కాదు
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావన్నారు. పీడీఎఫ్, వామపక్షాలకు చెందిన ఓట్లు టీడీపీకి పడ్డాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతను సూచించమన్నారు. మొత్తం అన్ని స్థానాలతో కలిపి ఫలితాలు చూడాలన్నారు. టీడీపీ సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదన్నారు. ఎమ్మెల్సీ ఫలితాలను హెచ్చరికగా భావించడం లేదని సజ్జల స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు వైసీపీని బాగా ఆదరించారన్నారు. ఈ ఫలితాలతో టీడీపీ బలం పెరిగిందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ఏదో అయిపోయిందనుకోవడం సరికాదన్నారు. ఎమ్మెల్సీ ఓట్ల బండిల్ లో ఏదో గందరగోళం జరిగిందని సజ్జల అన్నారు. కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని, వీటిపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఎన్నికల్లో ఓట్లు సమాజంలోని చిన్న సెక్షన్ మాత్రమేనని సజ్జల అన్నారు. ఈ ఫలితాలు మొత్తం సొసైటీని ప్రతిబింబిచవన్నారు. ఒక వర్గం ఓటర్లను రాష్ట్రం మొత్తానికి ఎలా ఆపాదిస్తారని సజ్జల ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రుల ఓటర్లు లేరన్నారు.