Chandrababu On Viveka Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. ఈ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. సొంత బాబాయ్‌ హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ అయిందని, అది కూడా జగన్ సీఎంగా ఉండగా! అన్నారు. సుప్రీం ఆదేశాలతో జగన్ తలెక్కడ పెట్టుకుంటారు అంటూ విమర్శలు చేశారు. జగన్  సీఎం పదవికి వెంటనే రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ స్పందించారు. బాబాయ్‌ హత్య కేసు పక్క రాష్ట్రానికి, అబ్బాయ్‌ చంచల్‌గూడ జైలుకు అంటూ ఎద్దేవా చేశారు.  ఈ మేరకు ట్వీట్‌ చేసిన లోకేశ్ "అబ్బాయ్ కిల్డ్ బాబాయ్" అనే హ్యాష్ ట్యాగ్ జోడించారు.






సీఎం జగన్ సమాధానం చెప్పాలి- మస్తాన్ వలీ 


వైఎస్ వివేకా హత్య కేసును ఏపీ నుంచి తెలంగాణకు తరలిపోవడంపై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ స్పందించారు. ఈ ఆదేశాలపై సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సీఎం జగన్ కుటుంబ సభ్యుడి హత్య కేసులో బాధితులకు ఏపీలో న్యాయం జరగడంలేదని విమర్శించారు. వివేకా సీఎం బాబాయ్ కాబట్టి దీనిపై మంత్రులతో కాకుండా సీఎం సమాధానం చెప్పాలన్నారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో ఏపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితేనే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. అత్యంత దారుణంగా వివేకానంద రెడ్డిని హత్య చేశారన్నారు. 


వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్ కు బదిలీ


వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసు విచారణను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసింది. హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఈ కేసును బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. తన తండ్రి వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చెయ్యాలంటూ ఆయన కుమార్తె సునీత సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో ఈ కేసు విచారణ సక్రమంగా జరిగే అవకాశం లేదని, గతంలో సాక్షులు, అప్రూవర్‌గా మారిన వారు కూడా అనుమానాస్పద రీతిలో మరణించారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్న తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమార్తె ఈ కేసు విచారణ పట్ల బాగా అసంతృప్తితో ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకొని ఈ కేసును కడప కోర్టు నుంచి హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నట్లుగా జస్టిస్ ఎంఆర్ షా వెల్లడించారు.