Chandrababu Naidu  :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతం కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవమని ఆయన స్పష్టం చేశారు.   రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఐదేళ్లుగా మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిన జగన్, ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకాలకు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ నోట అమరావతి అనే పేరు రాకపోవడం ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని, రాష్ట్ర రాజధాని పేరు పలకడానికి కూడా ఇష్టపడని వ్యక్తికి ప్రజలే బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, సూరేపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు.  

Continues below advertisement

జగన్ ఇటీవల ప్రస్తావించిన  మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు మావిగన్  అనే పదాన్ని చంద్రబాబు ఎద్దేవా చేశారు.  మావిగన్ అని ఏవేవో వింత పేర్లు తెస్తున్నారు.. ఇంకా నయం వాటికన్  అని అనలేదు. అసలు మావిగన్ అంటే అర్థం ఏంటో నిఘంటువుల్లో వెతికినా దొరకదు అంటూ సెటైర్లు వేశారు. గతంలో జగన్ ఒక్కడే సైకో అని భావించామని, కానీ ఇప్పుడు వైసీపీ నేతలందరూ అలాగే తయారయ్యారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ శ్రేణులు కూడా తర్కం లేకుండా జగన్ మాటలను వెనకేసుకొస్తున్న తీరు విచారకరమని అన్నారు. అమరావతికి చట్టబద్ధమైన హోదా కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కూడా జగన్ ఇంకా కుట్రలు పన్నుతూనే ఉన్నారని, కానీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి నిర్మాణం ఆగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

మీడియా పట్ల వైసీపీ అనుసరిస్తున్న తీరుపై కూడా సీఎం మండిపడ్డారు. జగన్ తప్పులను ఎత్తిచూపిన మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై దాడులు చేయడం అరాచకత్వానికి పరాకాష్ట అని అన్నారు. సోషల్ మీడియాలో కూడా అసభ్యకరమైన పోస్టులతో రాజకీయ ప్రత్యర్థులను వేధించడం వైసీపీకి పరిపాటిగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇకపై ఇలాంటి సైకో ం చేష్టలు సాగనివ్వమని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు.  

Continues below advertisement

అమరావతి కోసం 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతుల త్యాగం వృధా పోదని, రాబోయే రోజుల్లో అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాజధాని విషయంలో గత ఐదేళ్ల అనిశ్చితికి తెరపడిందని, అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందని భరోసా ఇచ్చారు. జగన్ ఇప్పటికైనా తన పంథా మార్చుకోవాలని, లేదంటే ప్రజలు మరింతగా తిరస్కరిస్తారని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.