Mla Kotamreddy Met CM Jagan : నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి  శ్రీధర్ రెడ్డి సీఎం జగన్ తో భేటీ అయ్యారు.  ఈ మధ్య పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కోటంరెడ్డి. సీఎంఓ నుంచి పిలుపు రావటంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు.  సీఎంతో భేటీ అనంతరం కోటంరెట్టి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక ఎమ్మెల్యే  సీఎంను కలవడం సర్వసాధారణం అన్నారు.  నెల్లూరు రూరల్లో గడప గడపకు కార్యక్రమం వెనకపడిందని, ఈ విషయంపై చర్చించామన్నారు. తాను ఎన్నోసార్లు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తిరిగానని, సీఎం జగన్  కు  తోడుగా ఉన్నానన్నారు. అనారోగ్య  కారణాల వల్ల తాను గడప గడపకు తిరగలేదన్నారు.  అయితే  ఆత్మీయ సమావేశాల  పేరుతో జనానికి  దగ్గరగా ఉన్నానని తెలిపారు. గ్రామ  సచివాలయంలో మాత్రం తిరగడంతో  పాటు గడప  గడపకు తిరగాలని  సీఎం  జగన్  చెప్పారని కోటంరెడ్డి తెలిపారు.  ఇక నుంచి గడప గడపకు  ఉద్ధృతం చేస్తామన్నారు. 


"నెల్లూరు రూరల్లో దర్గా అభివృద్ధి, మసీదు నిర్మాణం, లిఫ్ట్  ఇరిగేషన్ ప్రాజెక్ట్ రైతులకు పరిహారంపై సీఎం జగన్ తో చర్చించాను. అంబేడ్కర్ భవన్,  లైబ్రరీ ఏర్పాటుపై సీఎంకు  చెప్పాను. ఇతర సమస్య లను కూడా సీఎం దృష్టికి తీసుకు వెళ్లాను. నాకు  అధికారుల సహకారం లేదు. ఇది  ఓపెన్ గానే చెప్పాను. మిగిలిన ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై నేను  స్పందించలేను. ఒక  ఎమ్మెల్యేగా, సీఎం జగన్ గౌరవం  పెరిగే  ప్రయత్నంలో  ఉన్నా. నా  మాటలు రాజకీయ కోణంలో  కాకుండా మానవీయ  కోణంలో చూడండి. " - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 


అధికారులపై కోటంరెడ్డి అసంతృప్తి 


 ఇటీవల రెండు సందర్భాల్లో వైసీపీని ఇరుకున పెట్టేలా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నెల్లూరు జిల్లా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి అధికారులపై ఫైర్ అయ్యారు. రోడ్లు వేసేందుకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఒక సందర్భంలో రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ ను కలిస్తే ఆయన తనను అవమానించేలా వ్యవహరించారని కూడా అన్నారు శ్రీధర్ రెడ్డి. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తాను వెళ్తే కనీసం కూర్చోండి అని కూడా ఆయన అనలేదని బహిరంగ వేదికపైనే చెప్పారు. తానే కుర్చీ లాక్కొని ఎదురుగా కూర్చున్నా సరే కనీసం తనవైపు తలెత్తి చూడలేదని, ఆ తర్వాత సమస్యను వివరిస్తే ఊ అని ఊరుకున్నారని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధుల‌ మంజూరుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు వేస్తున్నారని ఆరోపించారు శ్రీధర్ రెడ్డి. తాను అందరు ఎమ్మెల్యేల్లాగా ఉండబోనని, తాడోపేడో తేల్చుకుంటానన్నారు. ప్రజలకోసం ఎంతదూరం అయినా వెళ్తానని, అన్నిటినీ మౌనంగా భరించే వ్యక్తిని మాత్రం తాను కాను అని చెప్పారు. నెల్లూరు రూరల్ లో రోడ్ల నిర్మాణంతో జనం ఇదేం ఖర్మ అనుకుంటున్నారని కూడా అన్నారు శ్రీధర్ రెడ్డి.