Minister Kottu Satyanarayana : పవన్ ట్వీట్లతో ప్రజలతో ఉన్నాను అనే భ్రమలో ఉన్నారని మంత్రి కొట్టు స‌త్యనారాయ‌ణ ఎద్దేవా చేశారు.  షూటింగ్ గ్యాప్ లో  ట్వీట్ లు చేయ‌టం ప‌వ‌న్ కు అల‌వాట‌ని వ్యాఖ్యానించారు. అంతే కాదు పవన్ కు రాజకీయ విలువలు లేవని ఫైర్ అయ్యారు. చంద్రబాబును నిలబెట్టుకోవాలని పవన్ తాపత్రయ పడుతున్నాడని, మా సామాజిక వర్గం వ్యక్తి ఇలా చేయడం చాలా బాధగా ఉందని కొట్టు సత్యనారాణ ఆవేద‌న వ్యక్తం చేశారు. సొంత సామాజిక వర్గం వాళ్లే పవన్ ను వ్యతిరేకిస్తున్నారన్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు. పాదయాత్రలో టీడీపీ నాయకులు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. 600 మందితో యాత్ర చేయమంటే టీడీపీ వాళ్లు ఎందుకు పాల్గొంటున్నారని ఆయ‌న ప్రశ్నించారు. టీడీపీ నేత‌లు రైతులు ముసుగులో చేస్తున్న పాద‌యాత్ర విష‌యాన్ని  కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు.


దేవాల‌యాల్లో టికెట్ ధ‌ర‌ను పెంచ‌లేదు 


ఏపీలోని  ఆల‌యాల్లో టికెట్ ధర‌ల‌ను ఎక్కడా పెంచ‌లేద‌ని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదు దేవాలయాల పాలక మండళ్లకు ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ఆమోదం తెలిపినట్లు మంత్రి సత్యనారాయణ తెలిపారు. తాడేపల్లిగూడెం ముత్యాలమ్మవారి దేవాలయం, ముత్యాలమ్మపురం, అమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, భీమవరం గుణుపూడి సోమేశ్వర స్వామి దేవాలయం, శ్రీకాకుళం పాతపట్నం శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి దేవాలయం, తిరుపతి తిమ్మయ్యపట్నం శ్రీ కోదండరామ స్వామి దేవాలయలం, పాలక మండళ్లకు  రాష్ట్ర ధార్మిక పరిషత్ ఆమోదం తెలిపిందన్నారు.  రాష్ట్రంలో 2009 తర్వాత 13 సంవత్సరాల తరువాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ తొలి సమావేశం సోమవారం జరిగింది. దేవాలయాలు, మఠాలకు సంబంధించి ప్రభుత్వానికి కూడా లేని అత్యున్నతమైన అధికారాలు ధార్మిక పరిషత్ కు రాజ్యాంగ పరంగా ఉన్నాయని ఆయన తెలిపారు.  


ధార్మిక పరిషత్ సమావేశం 


దేవాలయాలు, మఠాల నిర్వహణలో ఎటువంటి అన్యాయాలు, అక్రమాలకు తావులేకుండా వాటిని  క్రమబద్దీకరించడానికి ఈ ధార్మిక పరిషత్ అధికారాలు ఉన్నాయని మంత్రి కొట్టు తెలిపారు. ధార్మిక పరిషత్ తొలి సమావేశంలో  రాష్ట్రంలో రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకూ ఆదాయం ఉన్న  దేవాలయాల పాలక మండళ్లను ఆమోదించడంతో పాటు మఠాలకు సంబంధించిన వాటిపై సమగ్రంగా చర్చించామన్నారు. మఠాలకు సంబంధించి ముఖ్యంగా హాథీరాంజీ మఠం, బ్రహ్మంగారి మఠం, గాలిగోపుర మఠం, బ్రహ్మానంద మఠం, జగ్గయ్యపేట, అహాబిలం శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానంపై  ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించామన్నారు. వాటి విధి, విధానాలను పరిశీలించామన్నారు. హాథీరాం మఠం దాదాపు 650 సంవత్సరాల క్రింతం ఏర్పడిందని, ఈ మఠానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. జగ్గయ్యపేటలోని బ్రహ్మానంద మఠం వివరాలపై నివేదిక  రూపొందించి ధార్మిక పరిషత్ కు అందజేసేందుకు ఒక ఉప కమిటీని ఏర్పాటు చేశామన్నారు.   


నాయి బ్రాహ్మణుల‌కు న్యాయం చేస్తాం 


అసిస్టెంట్ కమిషనర్, డిప్యుటీ కమిషనర్, జాయింట్ కమిషనర్  హోదా స్థాయి దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణుల న్యాయమైన కోర్కెను సానుకూలంగా పరిశీలించాలని సీఎం జగన్ ఆదేశించారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. వారి జీవనోపాధికి ఎటువంటి ఆటంకం కలుగకుండా ప్రతి నెలా కనీస వేతనం రూ.20 వేలు అందేలాచూడాలని కూడా ముఖ్యమంత్రి సూచించారన్నారు. ఇలాంటి దేవాలయాలు రాష్ట్రంలో 50  వరకూ ఉన్నాయని, వాటిలో దాదాపు 850 మంది నాయీ బ్రాహ్మణులు పనిచేస్తున్నారన్నారు. కేశఖండనకై ప్రతి వ్యక్తి నుంచి వారు రూ.25/- లు వసూలు చేస్తుంటారని, ఈ విధంగా వసూలు చేసే సొమ్మును నాయీ బ్రాహ్మణులే ఉపయోగించుకుంటారన్నారు. అయితే  అలా వసూలు  అయ్యే సొమ్ము ఆఫ్ సీజన్ లో నెలకు కనీసం రూ.20 వేలు కూడా ఉండకపోవడం వల్ల వారి జీవనోపాధి చాలా కష్టంగా ఉంటుందని నాయీ బ్రాహ్మణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు.  ప్రతి దేవాలయంలో సంక్షేమ ట్రస్టు ఉందని, ఆ ట్రస్టు ద్వారా  వీరికి కనీస వేతనంగా రూ.20 వేలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా కేశఖండనకై వసూలు చేసే సొమ్ము రూ.25/- నుంచి రూ.35/-లకు పెంచాలని నాయీ బ్రాహ్మణుల కోరుతున్నారని, ఈ విషయం కూడా ప్రభుత్వ పరిశీనలో ఉన్నట్లు తెలిపారు.