Amabati On Chandrababu : పోలవరం ప్రాజెక్ట్ పై ప్రతిపక్షాల విమర్శలను మంత్రి అంబటి రాంబాబు తిప్పికొట్టారు. చంద్రబాబు ఐదేళ్లు సీఎంగా ఉండి పోలవరం ఎందుకు పూర్తి చేయలేదని అంబటి ప్రశ్నించారు. 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామని అసెంబ్లీలో చెప్పి ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టారో చెప్పండని టీడీపీని ప్రశ్నించారు. కమీషన్ల కోసం కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ ను చంద్రబాబు తీసుకున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై బురద రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం జగన్ పూర్తి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మోదీతో అంటకాగారని ఆరోపించారు. చంద్రబాబుది ఏం బతుకు, అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకోవడం ఆయన నైజం అంటూ అంబటి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
పార్టీ జెండాలతో వరద ప్రాంతాల్లో
చంద్రబాబు రెండు రోజుల పాటు పార్టీ జెండాలతో వరద ప్రాంతాల్లో పర్యటించారని, సహాయ కార్యక్రమాలకు విఘాతం కలుగుతుందని సీఎం ఆలస్యంగా వెళ్లారని మంత్రి అంబటి రాంబాబు వివరించారు. వరద బాధితులకు రూ.2 వేలు అందించిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. కడుపు మంటతో సీఎంను ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, 1983లో భద్రాచలం కరకట్ట చంద్రబాబు ఎలా కట్టారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వం కడితే చంద్రబాబు తన పేరు చెపుకుంటున్నారని, చంద్రబాబు జీవితమంతా రోడ్ల మీద తిరగడమేనని వ్యాఖ్యానించారు.
ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం
గోదావరి వరదల సమయంలో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం జగన్ వరద సాయం అందించడానికి ప్రజల దగ్గరికి వెళ్లారన్నారు. గోదావరి వరద ఉద్ధృతితో భారీ నష్టం జరిగిందని, వరదల కారణంగా అనేక మంది నిరాశ్రయులయ్యారన్నారు. ప్రభుత్వ చర్యలపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని స్పష్టంచేశారు. ప్రజల హర్షాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. పరామర్శల పేరుతో చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 1983లో చంద్రబాబు టీడీపీలో ఉన్నారా అని అంబటి ప్రశ్నించారు. 1983లో భద్రాచలంలో కరకట్ట కట్టానని చంద్రబాబు చెప్పుకుంటున్నారన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అంబటి రాంబాబు అన్నారు.
మరింత దూకుడుగా
పోలవరం వ్యవహరం వైసీపీ ప్రభుత్వానికి ఇరకాటంగా మారింది. చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్ట్ ను రాష్ట్రమే నిర్మిస్తుందని ఆ బాధ్యతలను ఏపీ సర్కార్ తీసుకుంది. ఆ తరువాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. కరోనా పుణ్యమాని ఖజానాపై తీవ్ర ప్రభావం పడింది. ఇక రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల విషయంలో కూడా వైసీపీ సర్కార్ తీవ్ర స్థాయిలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటుంది. ఈ సమయంలో పోలవరానికి నిధులు కేటాయించటం, పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవటం సాహనంగా మారింది. అయితే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం వద్ద పోలవరానికి కేటాయించాల్సిన నిధుల విషయంలో వెనుకంజ పడుతుంది. మరో వైపున ప్రతిపక్షాలు పోలవరాన్ని కేంద్రంగా చేసుకొని దూకుడు పెంచటంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ విమర్శలను తీవ్ర స్థాయిలో తిప్పికొట్టాలని భావిస్తోంది. దీంతో మంత్రి అంబటి ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. టీడీపీ సర్కార్ హయాంలో జరిగిన వైఫల్యాలను తెర మీదకు తీసుకురావటం ద్వారా వైసీపీ పై చేయి సాధిచేందుకు ప్రయత్నిస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఇక పోలవరం విషయంలో అధికార పక్షం అన్ని వైపుల నుంచి దూకుడుగా వెళ్లాలని భావిస్తోంది.