Commonwealth Games 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్ తొలి పతకం అందుకుంది. వెయిట్‌ లిఫ్టర్‌ సంకేత్‌ మహాదేవ్‌ సర్గార్‌ రతజం సాధించాడు. 55 కిలోల విభాగంలో 248 కిలోలు ఎత్తాడు. ఇదే సమయంలో 4x400 మీటర్ల రిలే స్టార్‌ స్ప్రింటర్‌ హిమ దాస్‌ స్వర్ణం గెలిచిందని సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె సంబరాలు చేసుకుంటున్న వీడియోలు ఇంటర్నెట్లో తిరుగుతున్నాయి. మరి ఆమె నిజంగానే పసిడి గెలిచిందా? ఈ వార్త నిజమేనా?


హిమ దాస్‌ సంబరాలు చేసుకుంటున్న వీడియో 2018లో జూనియర్‌ ఛాంపియన్‌ షిప్‌ గెలిచినప్పటిది. కామన్వెల్త్‌ క్రీడల్లో ఆమె ఇంకా పోటీ పడలేదు. 2022, ఆగస్టు 3న ఆమె పాల్గొంటున్న 4x400 మీటర్ల రిలే షెడ్యూలు చేశారు. కాబట్టి హిమ దాస్‌ స్వర్ణం గెలిచిన వీడియో ఫేక్‌! కాగా అంతర్జాతీయ క్రీడల్లో ఆమె భారత్‌కు ఎన్నో పతకాలు అందించింది. అంతర్జాతీయ ట్రాక్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయురాలిగా ఆమె రికార్డు సృష్టించింది. కామన్వెల్త్‌లోనూ ఆమె పతకం గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.


కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌ బోణీ కొట్టింది. బర్మింగ్‌హామ్‌ పోటీల్లో తొలి పతకం అందుకుంది. వెయిట్‌ లిఫ్టర్‌ సంకేత్‌ మహాదేవ్‌ సర్గార్‌ (SanketMahadev Sargar) రజత పతకం ముద్దాడాడు. 55 కిలోల విభాగంలో 248 కిలోలు ఎత్తి అద్భుతం చేశాడు. స్నాచ్‌లో 114 కిలోలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 135 కిలోలు ఎత్తాడు. ఆఖరి వరకు స్వర్ణం కోసం శ్రమించాడు. అతడి తండ్రి, సోదరి సైతం వెయిట్‌ లిఫ్టర్లే కావడం ప్రత్యేకం! కుటుంబ వారసత్వాన్ని అతడు ఘనంగా నిలబెట్టాడు.


స్నాచ్‌ విభాగంలో సంకేత్‌ ఏ మాత్రం రిస్క్‌ తీసుకోలేదు. వరుసగా 107, 111, 113 కిలోలు ఎత్తాడు. అతడి ప్రధాన పోటీదారు అనిక్‌ కస్‌దాన్‌ తొలి అవకాశంలోనే 107 కిలోలు ఎత్తాడు. ఆ తర్వాత రెండు ఛాన్సుల్లో విఫలమయ్యాడు. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో మొదటే 135 కిలోలు ఎత్తాడు. మొత్తం బరువును 248 కిలోలకు పెంచాడు. ఆ తర్వాత ప్రయత్నంలో అతడు గాయపడ్డాడు. మోచేతి బెణికింది. అయినా క్రీడాస్ఫూర్తితో మూడో లిఫ్ట్‌కు వచ్చి ఎక్కువ బరువు మోసేందుకు ప్రయత్నించి పూర్తి చేయలేకపోయాడు.