Mandous Cyclone : తీవ్ర తుపాను మాండూస్ తుపానుగా బలహీనపడిందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపాను కేంద్రీకృతమైందని తెలిపింది.  తుపాను ప్రస్తుతానికి శ్రీలంక జఫ్నాకు తూర్పు ఆగ్నేయంగా 230 కి.మీ, మహాబలిపురానికి 180 కి.మీ, చెన్నైకి 210 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. గడిచిన 6 గంటల్లో వాయువ్య దిశగా గంటకు 10కి.మీ వేగంతో మాండౌస్ కదులుతుందన్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము లోపు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటే సమయంలో 65-85 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. మాండూస్ తుపాను ప్రభావంతో ఈరోజు, రేపు దక్షిణకోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో  అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 
 
మహాబలిపురం పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం


మాండూస్ తుపాను గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకి తీవ్ర తుపానుగా మారి శుక్రవారం ఉదయం ఐదున్నర గంటల వరకు కొనసాగిందని తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. శుక్రవారం తీవ్ర తుపాను బలహీనపడి తుపానుగా కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం మాండూస్ కరేకల్ కి తూర్పు దిశలో 180 కి.మీ దూరంలోనూ, చెన్నై కి దక్షిణ ఆగ్నేయంగా 210 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిందన్నారు. రానున్న గంటల్లో వాయవ్య దిశలో పయనించి రేపు రాత్రికి గాని, రేపు ఉదయానికి గాని చెన్నైకి కరేకల్ కి మధ్యలో ఉన్న మహాబలిపురం పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీరం దాటే సమయంలో లేదా తీరం దాటిన తరువాత బలహీనమై తీవ్ర వాయుగుండంగా, వాయుగుండంగా, తరువాత అల్పపీడనంగా మారే అవకాశం ఉందని సునంద తెలిపారు. చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, అనంతపూరం, కడప జిల్లాలలో తేలిక నుంచి మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్లా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గాలులు గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. సముద్ర అల్లకల్లోలంగా ఉండడంతో రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. దక్షిణ తీర ప్రాంతాల్లో 3వ నెంబర్, ఉత్తర కోస్తాలో 2వ నెంబర్ హెచ్చరిక కొనసాగుతుందన్నారు.   


ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాండూస్ తుపాను ప్రభావం 


మాండూస్  తుపాను ప్రభావంతో తిరుపతి చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు తిరుపతి కలెక్టర్లు తుపాను ప్రభావంపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అధికారులకు సెలవులు రద్దు చేశారు. సచివాలయం సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించారు. తుపాను ప్రభావంతో తిరుపతి, తిరుమలలో‌, చిత్తూరు పుంగనూరు తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో వర్షం, చలికి తిరుమలకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లడ్డూ వితరణ కేంద్రంలో వర్షపు నీరు నిండిపోవడంతో వర్షపు నీటిని బయటకు పంపేందుకు టీటీడీ పారిశుద్ధ్య కార్మికులు ప్రయత్నిస్తున్నారు. వర్షం కారణంగా తిరుమల ఘట్ రోడ్డులో‌ ప్రయాణించే భక్తులను టీటీడీ విజిలెన్స్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉండడంతో భక్తులు అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించింది. తిరుమలలో‌ స్వామి వారి దర్శనంతరం బయటకు వచ్చిన వృద్దులు, చంటి పిల్లల తల్లిదండ్రులు వసతి గృహాలకి చేరుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు.