Pawan Kalyan : ఎంతో ఆనందంతో జరుపుకోవాల్సి ఉపాధ్యాయ దినోత్సవం రాష్ట్రంలో కళావిహీనంగా కనిపించే పరిస్థితి నెలకొనడం బాధ కలిస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం వేల విజ్ఞాన ప్రదాతలైన గురువులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. ఒక దేశం లేదా ఒక జాతి భవితవ్యానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులు అని, ఈ విషయాన్ని తాను విశ్వసిస్తానన్నారు. టీచర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించి సర్వోన్నతమైన రాష్ట్రపతి పదవి అలంకరించిన సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గురువులందరితోపాటు సర్వేపల్లిని గౌరవించుకున్నట్లే అన్నారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పని చేయడం తెలుగువారికి దక్కిన గొప్ప భాగ్యం అన్నారు.
గురు-శిష్య అనుబంధం కాలాలకు అతీతం
"వేద కాలం నుంచి భారతదేశంలో గురు-శిష్య అనుబంధం కాలాలకు అతీతంగా కొనసాగుతూనే ఉంది. తమ విద్యార్థుల ఉన్నతిని చూసి గురువులు పులకించిపోతారు. నెల్లూరులో నాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులు ఇప్పటికీ నా స్నేహితుల ద్వారా యోగక్షేమాలు తెలుసుకుంటున్నాను. అది తెలిసినప్పుడల్లా మనసు ఆనందంతో నిండిపోతుంది. వారు చెప్పిన మాటలు, బోధించిన పాఠాలు గుర్తుకు వస్తుంటాయి. తల్లిదండ్రుల తరువాత గురువులతో వాత్సల్యం ఎక్కువ. అటువంటి దైవ స్వరూపులైన గురువులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను." - పవన్ కల్యాణ్
ఉపాధ్యాయుల డిమాండ్లకు మద్దతు
ఏపీలో నెలకొన్న పరిస్థితుల మధ్య ఉపాధ్యాయ దినోత్సవం రాష్ట్రంలో కళావిహీనంగా మారడం బాధ కలిగిస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం పెడుతున్న మానసిక క్షోభ, హింసకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఈ వేడుకలు బహిష్కరించాలన్న నిర్ణయం వెనుక ఎంతో బాధ ఉందన్నారు. జ్ఞానాన్ని అందించే గురువులను వేధించిన వారందరూ చరిత్రహీనులుగా మిగిలిపోయారన్నారు. వేధింపులతో పాలిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఉపాధ్యాయులు కళ్లు తెరిపించాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ అన్నారు. ఉపాధ్యాయుల సానుకూల డిమాండ్లకు జనసేన పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు.
టీచర్స్ డే బహిష్కరణ
ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు టీచర్స్ డేను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం నాడు ప్రభుత్వం నిర్వహించే సత్కారాలు, సన్మానాలు తిరస్కరిస్తున్నట్లు ఏపీ టీచర్స్ ఫెడరేషన్(APTF) తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను అవమానిస్తుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయి. ఉపాధ్యాయులపై అక్రమ కేసులు, బైండోవర్లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నాయి. ప్రభుత్వం సొంత ఫోన్లలో ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు వేసేలా ఒత్తిడి చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. సీపీఎస్ రద్దు హామీని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read : Chandrababu : ఖబడ్దార్, దాడులు రిపీట్ అయితే ఎవరినీ వదిలిపెట్టం- చంద్రబాబు