Balineni Srinivas Reddy : జాతీయ చేనేత దినోత్సవాన్ని సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పవన్ కల్యాణ్ కు చేనేత ఛాలెంజ్ విసిరారు. దీనిని స్వీకరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ ఛాలెంజ్ ను పూర్తి చేసి టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ కు నామినేట్ చేశారు. అయితే పవన్ ఛాలెంజ్ ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వీకరించారు. దీనిపై స్పందిస్తూ చేనేత దుస్తులు ధరించిన ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు. పవన్ కల్యాణ్ చేనేత ఛాలెంజ్ ను స్వీకరించినట్లు ట్విట్టర్లో తెలిపారు. వైఎస్ఆప్ ప్రభుత్వంలో చేనేత మంత్రిగా పనిచేసిన తాను రూ.300 కోట్ల మేర చేనేత కార్మికులకు రుణమాఫీ చేశామని గుర్తుచేశారు.  






బాలినేని ట్వీట్ 


సీఎం జగన్ ప్రభుత్వంలోనూ చేనేత కార్మికులకు నేతన్న నేస్తం లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. అప్పుడైనా, ఇప్పుడైనా చేనేత కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. అందరూ చేనేత వస్త్రాలు ధరించాలని ఆయన కోరారు.  బాలినేని ట్వీట్ పై పవన్ కల్యాణ్ స్పందించారు. గౌరవనీయ బాలినేని వాసు గారూ నాడు చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం మీరు చేసిన ప్రయత్నాలకు అభినందనలు అని రిప్లై ఇచ్చారు. తన చేనేత ఛాలెంజ్ ను స్వీకరించి చేనేత కార్మికుల పట్ల మరోసారి అంకితభావాన్ని చూపించినందుకు తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పవన్ ట్వీట్ చేశారు. మరి చంద్రబాబు, లక్ష్మణ్ ఎలా స్పందిస్తారు వేచి చూడాలి.