Amaravati Farmers Protest: అమరావతి ఉద్యమ రైతులు అరెస్టు.. ఎక్కడికక్కడ కొనసాగుతున్న అరెస్టుల పర్వం

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు సుదీర్ఘంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 600వ రోజు అమరావతి రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు.

ABP Desam Last Updated: 08 Aug 2021 02:41 PM
మందడంలో మళ్లీ ఉద్రిక్తత

మందడంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైకోర్టు వైపు వెళ్లేందుకు అమరావతి రైతులు, మహిళలు ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. రోడ్డుపై బైఠాయించి మహిళలు నిరసన చేశారు.  మందడం రహదారిపై బైఠాయించి మహిళల నిరసన చేపట్టారు. 

టీడీపీ నేతలు దేవినేని ఉమ, కొనకళ్ల గృహ నిర్బంధం

అమరావతి రైతులు చేపట్టిన ఆందోళనలో పాల్గొంటారన్న సమాచారంతో  టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, కొనకళ్ల నారాయణను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మంగళగిరిలో అమరావతి ఉద్యమ రైతులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళగిరి లక్ష్మీనరసింహాస్వామి ఆలయం వద్దకు చేరుకున్న రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  

అమరావతి ఉద్యమ రైతులు అరెస్టు

తమ గళాన్ని మరోసారి వినిపించేందుకు అమరావతి రైతులు ఉద్యమిస్తున్నారు. జై అమరావతి .. రాజధాని అవరావతి అంటూ నినాదాలు చేస్తున్న రైతులను మంగళగిరిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా రైతులను సైతం రాజధాని ప్రాంతంలోకి వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

మందడంలో పోలీసులు, రైతులకు మధ్య స్వల్ప తోపులాట

అమరావతి రాజధాని ప్రాంతంలో పోలీసులు కట్టుదిట్ట చర్యలు కొనసాగిస్తున్నారు. అమరావతి రైతులు, మహిళలు హైకోర్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిలువురిస్తున్నారు. మందడంలో రైతులు, మహిళలను అడ్డుకోవడంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు, రైతులు, మహిళల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొంతమంది ఆందోళకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని మహిళలు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అమరావతి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు : చంద్రబాబు

అమ‌రావ‌తి పరిరక్షణ సమితి చేపట్టిన నిరసన కార్యక్రమానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మద్దతు తెలిపారు. ఇదొక చారిత్రక ఉద్యమమని ఆయన ట్వీట్ చేశారు. ప్రజా రాజధాని కోసం వేల ఎకరాలు త్యాగం చేసిన రైతుల న్యాయపోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చంద్రబాబు అన్నారు. 


కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ, కార్యకర్తలు అరెస్టు

మంగళగిరి మండలం కురగల్లు వద్ద కాంగ్రెస్‌ నేత మస్తాన్‌వలీ అరెస్టు పోలీసులు అరెస్టు చేశారు. అమరావతి రైతుల నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. మస్తాన్ వలీ, ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని మంగళగిరి గ్రామీణ పీఎస్‌కు తరలించారు. 

మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు

అమరావతి గ్రామాల్లో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ, కరకట్ట వెంట భారీగా పోలీసులను మోహరించారు. కరకట్టపై చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి, గుర్తింపు కార్డులను చూసి స్థానికులని నిర్ధారించుకుని మాత్రమే అనుమతిస్తున్నారు. వాహనాలను పూర్తిగా తనిఖీ చేశాకే గ్రామాల్లోకి వదులుతున్నారు. అమరావతి 600వ రోజు నిరసనలకు తెదేపాతో సహా వామపక్షాలు మద్దతు తెలిపాయి. తాడేపల్లిలో పలువురు తెదేపా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ తెదేపా శ్రేణులను అడ్డుకుంటున్నారు. అలాగే మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద భారీగా పోలీసులు పెట్టారు. అమరావతి రైతులు, మహిళలు ర్యాలీగా వస్తారన్న సమాచారంతో ఆలయం పరిసరాల్లో ఇనుప కంచె వేశారు. ఆలయం సమీపంలోకి ఎవ్వరినీ అనుమతించడంలేదు. 

ఉండవల్లి, మందడంలో రోడ్డుపై బైఠాయించిన మహిళలు

ఉండవల్లి నుంచి మంగళగిరి వైపు వెళ్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై మండిపడ్డ మహిళలు రోడ్డుపై బైఠాయించారు. తమ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందడం రైతు శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడ కూడా మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. 

న్యాయస్థానం టు దేవస్థానం ర్యాలీకి అనుమతి లేదు : పోలీసులు

రాజధాని అమరావతి పోలీసులు వలయంలో ఉంది. అమరావతి ఉద్యమం నేటితో 600 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమరావతి ఐక్యకార్యాచరణ సమితి నిరసనలు, ర్యాలీకి పిలుపునిచ్చింది. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో హైకోర్టు నుంచి మంగళగిరిలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ  ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు నిరాకరించారు. రాజధాని గ్రామాల్లో ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించారు. ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, గుర్తింపు కార్డు ఉన్న స్థానికులను మాత్రమే పంపిస్తున్నారు. రాజధాని గ్రామాల్లోకి మీడియాను సైతం అనుమతించడం లేదు. పెదపరిమి వద్ద మీడియా ప్రతినిధుల వాహనాలను పోలీసులు అడ్డుకుని, నిలిపివేశారు. 

తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత

అమరావతి రాజధాని గ్రామాలు పోలీసులు వలయాల్లో ఉన్నాయి. తుళ్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. తుళ్లూరు శిబిరం నుంచి రైతులు, మహిళలు బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. తుళ్లూరు వచ్చే అన్ని మార్గాల్లో భారీగా పోలీసులను మోహరించారు.  తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తుళ్లూరు దీక్ష శిబిరం నుంచి ర్యాలీగా వెళ్లేందుకు రైతులు, మహిళలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో రైతులు, మహిళలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. 

రాజధానిలో పోలీసుల భారీ బందోబస్తు..



నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నేటి ఉదయం నుంచి టెన్షన్ వాతావరణం నెలకొంది. పోరాటం ఉద్ధృతం చేయడంలో భాగంగా అమరావతి రైతులు ర్యాలీగా వచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. రాజధానిలో, పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించింది. వాహనాలను పోలీసులు ఎక్కడక్కడ నిలిపివేసి తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా కొత్తవారిని రాజధాని ప్రాంతంలోకి అసలు అనుమతించడం లేదు. వారు ఏం చెప్పినా పోలీసులు వినిపించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Background

అమరావతి రైతుల ఉద్యమం 600వ రోజుకు చేరుకుంది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు సుదీర్ఘంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఏపీలో మూడు రాజధానులంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేయడంతో రైతులు తమ పోరాటాన్ని మొదలుపెట్టారు. రాజధానిని అమరావతి నుంచి తరలించకూడదని, తమకు ఏకైక రాజధానే పరిష్కార మార్గమని రైతులు తమ నిరసన తెలుపుతున్నారు. ఢిల్లీ స్థాయి వరకు తమ గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. కేసులు నమోదవుతున్నా.. వెనుకడుగు వేయకుండా రైతులు ముందుకు సాగుతున్నారు. నేటి ఉదయం నుంచి రాజధాని ప్రాంతానికి రైతులు, యువకులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.