Amaravati Farmers: "మనం మన అమరావతి" పేరుతో భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ నిర్వహిస్తున్న పాదయాత్రలో రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. మధ్యాహ్న భోజనానికి మందడంలో ఆగిన రామకృష్ణపై అమరావతి రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. భాజపా నేతలకు అమరావతి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అంటూ నిలదీశారు. ఉద్యమం చేస్తున్న మహిళలు పట్టు చీరలు కట్టుకొని పోరాటం చేస్తున్నారని ఎంపీ జీవీఎల్ మాటలను గుర్తు చేశారు. దీనికి బీజేపీ నాయకులు ఏం సమాధానం చెబుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో రైతులపై కేసులు పెట్టినపుడు ఎందుకు స్పందించ లేదని అన్నారు. దిల్లీని మించిన రాజధానిని కడతామని చెప్పిన మోదీ వ్యాఖ్యలు ఏమయ్యాయని రైతులు అడిగారు. భాజపా అనుకూల, వ్యతిరేక వర్గ రైతుల మధ్య కాసేపు వాగ్వాదం చెలరేగింది. 


చీకటి జీవో అంటూ రైతుల ఆందోళన..


అమరావతి నిర్మాణ పనుల కోసమని రాజధాని భూములను విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మేరకు రాజధాని గ్రామాలకు చెందిన రైతులు గతంలోనే రాత్రి నిరసన గళం విప్పారు. రాజధాని నిర్మాణాలను చేపట్టకుండా భూములు విక్రయించేందుకు చీకటి జీవోను జారీ చేసిందని మండిప్డారు. అమరావతిని నిర్వీర్యం చేయడానికే గత ప్రభుత్వంతలో బీఆర్ షెట్టి మెడిసిటీకి కేటాయించిన 100 ఎకరాలు, లండన్ కింగ్స్ కాలేజీకి కేటాయించిన 148 ఎకరాలను విక్రయించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. 


టీడీపీ వాళ్ల తప్ప తమకెవరు అండగా లేరట..


రాజధాని రైతులకు కౌలు, పేదలకు పింఛన్లు చెల్లించడం లేదని చెప్పారు. అసైన్డ్ రైతులు, నాన్ పూలింగ్ భూముల్లో ప్లాట్లు వచ్చిన రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం రాజధాని భూములను అమ్మడానికి సిద్ధ పడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. న్యాయ స్థానాలు తీర్పు ఇచ్చినా ఒక్క గమేలా సిమెంటు వేసి రాజధానిలో పని చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా పదవుల్లో ఉన్న వారిలో కొందరు బహిరంగంగానే 3 రాజధానులను తప్పుబట్టారని గుర్తు చేశారు. బీజేపీ, వైసీపీలు అమరావతి రైతుల పాదయాత్రను ఎంతగా అడ్డుకోవాలని చూసినా టీడీపీ నేతలు, పార్టీ శ్రేణులు తమకు అండగా నిలిచాయని రైతులు చెబుతున్నారు. 


పాదయాత్ర ఆరంభం నుంచి ముగింపు వరకూ... తెలుగు దేశం నేతలు రైతులకు పూర్తి వెన్ను దన్నుగా నిలిచారు. ఇతర జిల్లాల నుంచి పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్ర సాగినన్ని రోజులు గ్రామాలు, నియోజక వర్గాలు, జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా తమకు అండగా నిలిచారని చెప్పారు. చాలా ప్రాంతాల్లో భోజనం, వసతి వంటి సౌకర్యాలను కల్పించి సహకారం అందిచారని గుర్తు చేశారు. అప్పుడు రాని బీజేపీ నాయకులు... ఇప్పుడు ఎందుకు సాయం చేసేందుకు వస్తున్నారంటూ మండి పడ్డారు.