Perni Nani on BRS : ఏపీలో బీఆర్ఎస్ ప్రస్థానం మొదలైంది. తోట చంద్రశేఖర్ ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించారు. అయితే ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. సోమవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోటీ చేయడం ఖాయమన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో కేఏ పాల్ పార్టీ కూడా పోటీ చేస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ పోటీ చేస్తే తప్పేంటన్నారు. తెలంగాణ మంత్రులు భయంతో ఉన్నరాన్నారు. ఏపీలో కేసీఆర్ ఏం చేస్తారని ప్రశ్నించారు. ఏపీని వాళ్లేంటి ఉద్దరించేదన్నారు. శ్రీశైలం, సాగర్, పులిచింతలలో దొంగ కరెంట్ తీసుకోవడం లేదా అని పేర్ని నాని విమర్శించారు. ఏపీకి వెన్నుపోటు పొడుస్తోంది ఎవరో తెలుసన్నారు. మా ఆస్తులు మాకు పంచుతున్నారన్నారు. విద్యుత్ బకాయిలు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. ఏపీకి ద్రోహం చేసి ఇప్పుడు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏదైనా ఉంటే తెలంగాణలో చూసుకోవాలన్నారు.
చంద్రబాబుపై ఫైర్
గుంటూరు తొక్కిసలాట ఘటనపై మాజీ మంత్రి పేర్నినాని విమర్శలు చేశారు. సంక్రాంతి కానుక పేరుతో భారీగా జనాన్ని తరలించి తొక్కిసలాటకు కారణమన్నాయని టీడీపీపై మండిపడ్డారు. ఈ ఘటనతో చంద్రబాబుకు సంబంధం లేదంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తప్పును ఎన్‌ఆర్‌ఐ సంస్థ, పోలీసులపై నెట్టేసి ప్రయత్నంచేశారన్నారు. టీడీపీ కార్యక్రమం పేరుతోనే ఆ పార్టీ నేతలే అనుమతి తీసుకున్నారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు రాజకీయ క్రీడలో మరో మూడు ప్రాణాలు పోయాయని పేర్ని నాని విమర్శించారు. స్వచ్ఛంద సంస్థల ముసుగులో తప్పుడు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014 నుంచి చంద్రబాబుకు డ్రోన్ పిచ్చి పోవడంలేదన్నారు. ఇరుకు సంధుల్లో సభలు పెట్టి జనాల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. దత్తుపుత్రుడు పవన్ కల్యాణ్ బీజేపీతో ఉంటూ చంద్రబాబుకు సైగ చేస్తున్నారన్నారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్ ను అంగుళం కూడా కదల్చలేదన్నారు.
బీఆర్ఎస్ పై మంత్రి రోజా స్పందన
"ఎవరైనా ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. అందరూ అన్నదమ్ముల్లాగా ఉన్న సమయంలో మాకు రాష్ట్రం కావాలని చెప్పి ఏపీ, తెలంగాణను విడగొట్టారు. ఇప్పుడు ఏపీకి వచ్చి బీఆర్ఎస్ నేతలు ఏం సమాధానం చెబుతారో వాళ్లు నిర్ణయించుకోవాలి. విభజన చట్టంలోని న్యాయపరంగా ఏపీకి రావాల్సిన వాటిని తెలంగాణ అడ్డుకుంది. చంద్రబాబు ఓటుకు నోటు కేసును అడ్డుపెట్టుకుని ఏపీ అన్యాయం చేశారు. బీఆర్ఎస్ లో చేరిన వాళ్లు, పార్టీ పెట్టిన వాళ్లు ఏం సమాధానం చెబుతారో చూద్దాం" - మంత్రి రోజా
ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ
ఏపీ నేతలు బీఆర్‌ఎస్ లో చేరారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్, పార్థసారథి, టీజే ప్రకాష్, రమేష్ నాయుడు, గిద్దల శ్రీనివాస్, జేటీ రామారావులకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తోట చంద్రశేఖర్‌ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ నియమించారు. దిల్లీ కేంద్రంగా రావెల కిశోర్ బాధ్యతలు నిర్వహిస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.