Perni Nani On Pawan Kalyan : వైఎస్ వివేకా హత్య కేసు పరిణామాలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. రాంసింగ్ అనే అధికారి నేతృత్వంలో విచారణ తప్పుడు మార్గంలో వెళ్తోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందన్నారు. ఆ తర్వాత వచ్చిన సీబీఐ అధికారి కూడా ఇప్పుడు ఇదే తరహాలో విచారణ చేస్తున్నారని ఆరోపించారు. విచారణలో దురుద్దేశాలు ఉన్నాయన్నారు. పూర్తి రాజకీయ కోణంలో, ఒత్తిడితో విచారణ జరుగుతోందని ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పారన్నారు. వివేకా కేసు వక్ర మార్గంలో విచారణ జరుగుతోందన్నారు. ఏం జరిగినా కూడా న్యాయమే గెలుస్తుందన్నారు.
ఏపీపై విమర్శలు చేస్తే ఎందుకు మాట్లాడలేదు
తెలంగాణ ప్రజలకు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అన్నారు. పవన్ కల్యాణ్ కు కొత్త బంధాలు వచ్చాయని, బీఆర్ఎస్ పై ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 11 రోజులు భోజనం మానేశా అన్న పవన్ కు.. ఇప్పుడు ఏమో తెలంగాణపై ప్రేమ పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. ఏపీపై తెలంగాణ మంత్రులు విమర్శలు చేస్తే పవన్ ఎందుకు మద్దతు పలుకుతున్నారని ప్రశ్నించారు. ఏపీపై విమర్శలు చేస్తే ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్ లతో పాటు ఇప్పుడు తెలంగాణపై విమర్శలు చేసినా పవన్ వస్తున్నారన్నారు. బీజేపీపై విమర్శలు చేస్తే పవన్ ఖండించవచ్చని కానీ.. పవన్ కొత్త వకాల్తా అర్థం కావట్లేదన్నారు.
ఈ కొత్త బంధం, బాధ అర్థంకావట్లేదు
"మూడు రోజుల క్రితం జరిగిన దానిపై ఇవాళ నిద్రలేచి మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు, మంత్రులు హద్దు తప్పిమాట్లాడుతున్నారంటున్నారు. పవన్ కు బాగా బాధ కలిగించిందంట. తెలంగాణ ప్రజలపై ఏపీ మంత్రులు ఏం అనకపోయినా, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే పవన్ కు బాధేస్తుంది. ఈ కొత్త బాధ ఏంటో అర్థంకావట్లేదు. బీఆర్ఎస్ పై ఈ కొత్త ప్రేమ ఏంటో మరి. ఈ కొత్త బంధం ఏర్పడకముందు ఏపీ ప్రజలు తెలంగాణకు బానిసలా అన్నారు పవన్. కన్న తల్లిలాంటి ఏపీని తిడితే తిరిగి మాట్లాడతాం. నిన్ను తిడితేనే చించుకున్నావు కదా పవన్. నువ్వు ఏపీవాడివి కాదా? నీ కుటుంబం మొత్తం అక్కడే, నీ వ్యాపారాలు అక్కడే... ఏదో కొత్త బంధం కోసం పవన్ మాట్లాడుతున్నారు. హరీశ్ రావు ఏపీపై అవమానకరంగా మాట్లాడితే దానిపై ఏపీ మంత్రులు స్పందించారు. దానిని తెలంగాణ ప్రజలను అవమానించినట్లు మార్చి పవన్ మాట్లాడుతున్నారు. "- మాజీ మంత్రి పేర్ని నాని
బీఆర్ఎస్ నేతలపై ఈగ వాలనివ్వడంలేదు
తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఏపీ గురించి మొదట ఏమి అన్నారో, దానికి ప్రతిగా ఆంధ్రా మంత్రులు, వైసీపీ నేతలు ఏమన్నారో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఎవరు ఏం అనకపోయినా వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ బురద జల్లుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ మీద, బీఆర్‌ఎస్ పై పవన్ కల్యాణ్ కొత్త బాధ ఏమిటో అర్థం కావట్లేదన్నారు. లోక్‌సభ నుంచి బయటకు పంపి రాష్ట్రాన్ని విడదీస్తే ఏడుపొచ్చి 11 రోజులు అన్నం మానేశానని పవన్ గతంలో చెప్పిన వీడియోలను పేర్ని నాని మీడియా సమావేశంలో ప్రదర్శించారు. బీఆర్‌ఎస్ నేతలపై ఈగ వాలనివ్వడంలేదని, వాళ్లను ఏదైనా అంటే పవన్ బయటకొస్తున్నారి దీని వెనక కారణం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బానిసలా అని గతంలో నిలదీసిన పవన్, తెలంగాణ వారితో తిట్టించుకుంటూ ఉండాలా అని నిలదీయడం గుర్తు లేదా అని పేర్ని నాని ప్రశ్నించారు.