CM Jagan On Polavaram : పోలవరం అంటే వైఎస్‌ఆర్, వైఎస్‌ఆర్ అంటే పోలవరం అని సీఎం జగన్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో గురువారం పోలవరంపై చర్చ జరిగింది. ఈ చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసమే ఇటీవల దిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశానని సీఎం జగన్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓ క్రమపద్ధతిలో పనులు చేపట్టిందన్నారు. స్పిల్‌వే అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తచేశామని సీఎం జగన్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసమే ఇటీవల ప్రధాని మోదీని కలిశానన్నారు. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్రం సాయం కోరామన్నారు. తాత్కాలిక పనుల కోసం రూ. 15 వేల కోట్లు కేంద్రాన్ని అడిగామని సీఎం జగన్ తెలిపారు.
పోలవరం పూర్తిచేసేది నేనే
పోలవరం డ్యామ్ ఎత్తుపై దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తామన్నారు. సీడబ్ల్యూసీ సిఫార్సుల మేరకు తొలి దశలో 41.15 మీటర్ల వరకు కడతామని స్పష్టం చేశారు. పోలవరంలో ప్రతీ ముంపు కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని సీఎం జగన్ మరోసారి ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పోలవరం ప్రాజెక్టను చేపడుతున్నామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేది మేమేనన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు చేసిందేంలేదన్నారు. అసలు పోలవరం పేరు పలికే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.
స్పిల్ వే, అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి
పోలవరం పనులు చంద్రబాబు చేశారని అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది దివంగత నేత వైఎస్‌ఆర్ అన్నారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేసేది ఆయన కుమారుడైన జగన్ అన్నారు. పోలవరం అంటే వైఎస్‌ఆర్, వైఎస్‌ఆర్ అంటే పోలవరం అని సీఎం జగన్ పేర్కొన్నారు. పోలవరంలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 800 కోట్లు ఆదా చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటికే స్పిల్ వే అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తిచేశామన్నారు. ప్రస్తుతం గోదావరి డెల్టాకు నీరు అందించే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్పిల్‌వే పూర్తి చేసి 48 గేట్లు ఏర్పాటుచేశామన్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పూర్తి చేసినట్లు అసెంబ్లీలో తెలిపారు. గోదావరిలో భారీగా వరద వచ్చినా స్పిల్‌వే ద్వారా వరదను నియంత్రించగలిగామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
కేంద్రం ఏమందంటే?
పోలవరం ప్రాజెక్టు పై కేంద్రం పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేసింది. తొలి దశలో పోలవరం ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితమని స్పష్టం చేసింది. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకేనని తేల్చి చెప్పింది. వైసీపీ ఎంపీ సత్యవతి లోక్ సభ లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. తొలిదశ సహాయ, పునరావాసం ఫిబ్రవరి 2023కే పూర్తి కావాల్సి ఉందని, తొలిదశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకు సహాయ, పునరావాసం ఫిబ్రవరి 2023 నాటికే ఇవ్వాల్సి ఉందని.. దానిని కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదని ప్రహ్లాద్ సింగ్ పటేల్ అన్నారు. కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఏపీ ప్రభుత్వం కల్పించినట్లు చెప్పారు. మిగతావారికి సహాయ, పునరావాసం మార్చి 2023 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా.. ఇంతవరకు చేయలేదని ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు.