CM Jagan Review : పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ శాఖ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం సమీక్షించారు.  సీఎం జగన్ అధికారులతో మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో ఎంఐజీ లేఅవుట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ లేఅవుట్లు ఆదర్శనీయంగా ఉండాలన్నారు. లే అవుట్స్‌ నియమాలు, నిబంధనలు, ప్రమాణాలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలన్నారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ (ఎంఐజీ లేఅవుట్స్‌) కోసం ఇప్పటి వరకూ 82 అర్బన్‌ నియోజకవర్గాల్లో సుమారు 6791 ఎకరాల గుర్తించినట్లు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైయస్సార్, కర్నూలు, శ్రీ సత్యసాయి, తిరుపతిలో 864.29 ఎకరాల్లో లే అవుట్‌ పనులు ప్రారంభించామన్నారు. ఈ లేఅవుట్స్‌ను మే చివరికి సిద్ధం అవుతాయని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు.  


క్లీన్ ఏపీపై 


తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర వ్యర్థాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఏ కలర్‌ డబ్బాలో ఏ చెత్త వేయాలి అన్నదానిపై కరపత్రాలను ప్రతి ఇంటికీ ఇవ్వాలన్నారు. ఇప్పటికే 1.12 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీ చేశామని అధికారులు తెలిపారు. 8 లక్షల చెత్త డబ్బాలను మే 22 నాటికి పంపిణీ చేస్తామన్నారు. 2426 ఆటోలు ఇప్పటికే క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయన్నారు. 1123 ఈ–ఆటోలు కూడా జూన్‌ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు డిసెంబరు నాటికి పూర్తయ్యేలా కార్యాచరణ  చేపట్టామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు.  


జూన్ నాటికి రోడ్ల పనులు పూర్తి 


ప్రతి రోజూ ప్రతి ఇంటికీ తాగునీరు అందాలని సీఎం జగన్ అన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలు, వస్తున్నాయి, పోతున్నాయి కానీ అసలు సమస్య పరిష్కరించడంలేదని సీఎం అన్నారు.  ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటనేవి తెలుసుకుని పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు వాటి పరిష్కారంలో అంకిత భావం చూపాలని సూచించారు. రోడ్లు, తాగునీరు, మురుగునీటి శుద్ధిలాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా టిడ్కో ఇళ్లు ప్లాన్‌ చేశారని సీఎం జగన్ అన్నారు. పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, తాగునీటి కోసం వాటర్‌ ట్యాంకులు, మురుగునీటి శుద్ధి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇవి లేకపోతే టిడ్కో ఇళ్లు మురికివాడలు మాదిరిగా తయారయ్యేవన్నారు. మంచి జీవన ప్రమాణాలు అందించే దిశగా అడుగులు ముందుకేస్తున్నామన్నారు. టిడ్కో ఇళ్లపై సుమారుగా రూ.5500 కోట్లు ఖర్చుచేశామన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రోడ్లపై దృష్టిసారించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గుంతలులేని రోడ్లు కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాడు–నేడు కింద బాగు చేసిన రోడ్లను చూపించాలన్నారు. జూన్‌ నాటికి రోడ్ల పనులు పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రితో తెలిపారు.  


అమరావతిలో పనులపై సీఎం సమీక్ష


కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం అయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటికే విద్యుత్‌ స్తంభాలను తొలగించామన్నారు. దీంతో పనులు వేగవంతం అవుతున్నాయన్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు (ఇ–3)పైన కూడా దృష్టిపెట్టామన్నారు.  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌ అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని సీఎంకు వెల్లడించారు. విశాఖ మెట్రోరైల్‌ ప్రాజెక్టుపై సీఎం సమీక్షించారు. మెట్రో ప్రాజెక్టుకు వనరుల సమీకరణపై చర్చించారు. సుమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైల్‌ ప్రతిపాదనలు వచ్చాయన్నారు. మెట్రోరైల్‌ ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులో భాగంగా కోచ్‌ల డిజైన్, స్టేషన్లలో ఉండే సౌకర్యాలు తదితర వివరాలు సమగ్రంగా సమర్పించాలన్నారు. పర్యావరణహిత విధానాలకు పెద్దపీట వేయాలన్నారు. 


జగనన్న మహిళా మార్ట్‌లపై సీఎం సమీక్ష


మహిళా స్వయం సహాయక సంఘాలతో నడుస్తున్న మహిళా మార్ట్‌ల వివరాలను అధికారులు సీఎంకు తెలిపారు.  ఈ మార్ట్ లు విజయవంతంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. వీలైనన్ని మహిళా మార్ట్‌లను నెలకొల్పాలన్నారు. దీనికోసం ప్రభుత్వం నుంచి తగినంత సహాయ సహకారాలు అందించాలన్నారు. మహిళా మార్ట్‌ల కోసం వివిధ ప్రాంతాల్లో మంచి భవనాలను గుర్తించాలన్నారు.