CM Jagan : విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు దిగువున మరో బ్యారేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షపు నీటిని నిల్వ చేసేందుకు చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. వరద నీరు దిగువకు వెళ్లకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు బ్యారేజ్ నిర్మాణం అవసరమని అధికారులతో అన్నారు. పోలవరం కల సాకారం అయితే వరద నీటి నిల్వలు కూడా పుష్కలంగా ఉంటాయని సీఎం ఆకాంక్షించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంలో కోతకు గురైన ప్రాంతంలో చేపట్టే పనుల ప్రణాళికపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు. ప్రస్తుత పరిస్థితులను సీఎంకు  అధికారులు వివరించారు. ఇప్పటికీ గోదావరిలో వరద కొనసాగుతోందని, ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కుల వరదనీరు ఉందన్న అధికారులు, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంలో ఎలాంటి పనులు చేపట్టాలన్నా ముందుగా కోతకు గురైన ప్రాంతంలో పరీక్షలు, ఆ పరీక్షల్లో వెల్లడైన అంశాలు, దాని తర్వాత డిజైన్ల ఖరారు పూర్తయితే కానీ చేయలేమని అధికారులు సీఎంకు వివరించారు.  కోతకు గురైన ప్రాంతంలో పరిస్థితులు, డయాఫ్రం వాల్‌ పటిష్టతపై నిర్ధారణ  కోసం పరీక్షలు నవంబరులో మొదలవుతాయని, తుది నిర్ణయం రావడానికి డిసెంబరు నెలాఖరు వరకూ పట్టే అవకాశం ఉందని, ఆతర్వాత సీడబ్ల్యూసీ డిజైన్లు, మెథడాలజీ ఖరారు చేయాల్సి ఉంటుందని అధికారులు సీఎం జగన్ కు నివేదిక అందించారు.


ప్రకాశం బ్యారేజ్ కు దిగువున మరో బ్యారేజ్ 


 ఈ సమీక్ష సమావేశంలో వెలిగొండ టన్నెల్‌ –2లో  మిగిలి ఉన్న 3.4 కిలో మీటర్ల సొరంగం పనులపై సీఎం అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజీ దిగువన మరో బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలన్న సీఎం, ఇందుకు అవసరం అయిన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతే కాదు సీఎం ఆదేశాలతో కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌  పనులు కూడా జూన్‌ కల్లా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు వివరణ ఇచ్చారు. వీటన్నింటితో పాటు రిజర్వాయర్లు, నీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని,అవసరమైన సిబ్బందిని నియమించుకోవడంతోపాటు, నిర్వహణపై ఒక కార్యాచరణ రూపొందించాలని, క్రమం తప్పకుండా నిర్వహణ పనులు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. 


ఎత్తిపోతల పథకాలు 


లిఫ్ట్‌ స్కీంల నిర్వహణ కోసం ఎస్‌ఓపీ అమలు చేయాలని సీఎం జగన్ అన్నారు. ఏళ్ల కొద్దీ నిర్వహణ సరిగ్గా లేక చాలా ఎత్తిపోతల పథకాలు మూలనపడుతున్నాయని తెలిపిన సీఎంకు తెలిపారు. వీటి నిర్వహణపై ఒక ఎస్‌ఓపీ రూపొందించాలని, సంబంధిత ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులను కమిటీలుగా ఏర్పాటు చేసి వారి పర్యవేక్షణలో  ఎత్తిపోతల పథకాలు నడిచేలా తగిన ఆలోచనలు చేయాలన్నారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మంచి విధానాలను గుర్తించి వాటిపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ప్రభుత్వం నుంచి ఒక కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటయ్యేలా చూడాలని, కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తున్నందున, నిర్వహణ రైతుల పర్యవేక్షణలో సమర్థవంతంగా నడిచేలా తగిన అవగాహన కల్పించాలన్నారు. రైతులకు శిక్షణ  ఇప్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.