CM Jagan Review : రైతులు ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందన్న మాట ఎక్కడా వినిపించకూడదని సీఎం జగన్ అన్నారు. వ్యవసాయ శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహిచారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసేస్తున్నామన్నారు. రైతులకు ఎక్కువ ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ కొనసాగాలని సూచించారు. ఇ-క్రాపింగ్ డేటాను వాడుకుని అత్యంత పటిష్ట విధానంలో ధాన్యం సేకరించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖతో పౌరసరఫాల శాఖ అనుసంధానమై రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే రబీకి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఎరువులు, విత్తనాలు, ఇలా అన్నిరకాలుగా రైతులకు కావాల్సిన వాటిని అందించేందుకు సిద్ధం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఆర్బీకేలో డ్రోన్
ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక డ్రోన్‌ను ఉండేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్ అన్నారు. వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లో డ్రోన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూసార పరీక్షలు చేసే పరికరాలను ఆర్బీకేలో అందుబాటులో ఉంచాలన్నారు. భూసార పరీక్షలు కారణంగా ఏ ఎరువులు వాడాలి, ఎంత వాడాలన్న దానిపై స్పష్టత వస్తుందని సీఎం జగన్ అన్నారు. దీంతో రైతులకు పెట్టుబడి తగ్గుతుందని, దిగుబడులు కూడా పెరుగుతాయన్నారు. భూసారాన్ని పరిరక్షించుకునేందుకు ఓ అవకాశం ఏర్పడుతుందని సీఎం జగన్ అధికారులతో అన్నారు.
29న ఇన్ పుట్ సబ్సిడీ జమ
రైతులు పండించిన ప్రతి పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు పంట అమ్ముకోవాల్సి పరిస్థితి రాకూడదన్నారు. దీనిని అధికారులు ఒక సవాల్‌గా తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖతో పౌరసరఫరాల శాఖ అనుసంధానమై రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 29న సున్నా వడ్డీ పంట రుణాలతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ జమచేయాలని అధికారులకు సూచించారు. ప్రతి ఆర్బీకేలో ఒక డ్రోన్‌ను ఉంచేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్.. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ద్వారా ఇచ్చిన వ్యవసాయ యంత్ర సామగ్రి అంతా రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షలో మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : Goutham reddy book : గౌతమ్ రెడ్డి 'చిరస్మరణీయుడు', సీఎం చేతుల మీదుగా పుస్తకం ఆవిష్కరణ