CM Jagan Review : టిడ్కో ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సోమవారం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. పురపాలకశాఖలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సమీక్షించిన సీఎం...త్వరగా ఇళ్లను పూర్తిచేయాలని ఆదేశించారు. నిర్దేశించుకున్న సమయంలోగా పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలని సూచించారు. ఆలోగా రిజిస్ట్రేషన్లు కూడా పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలన్నారు. టిడ్కో ఇళ్లలో మౌలిక సదుపాయాల పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు సీఎంకు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో రూ.4500 కోట్లు ఖర్చుచేశామని అధికారులు తెలిపారు. మరో రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు.
రోడ్ల అభివృద్ధిపై సీఎం సమీక్ష
నగరపాలక, పురపాలక సంస్థల్లో రోడ్ల అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్షించారు. 16,762 రోడ్లకు సంబంధించి 4396.65 కి.మీ మేర రోడ్లు నిర్మాణం కోసం రూ.1826.22 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ఇప్పటికే 55.15 శాతం పనులు పూర్తి చేశామని అధికారులు సీఎంకు తెలిపారు. వీటితోపాటు రోడ్లపై గుంతలు పూడ్చే పనులు కూడా ముమ్మరంగా చేస్తున్నామన్నారు. జులై 15 నాటి కల్లా రోడ్లపై గుంతలు లేకుండా పనులు పూర్తిచేస్తామని అధికారులు స్పష్టం చేశారు. మురుగునీటి జలాల శుద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. మురుగునీటి శుద్ధిపై రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలను అధికారులు వివరించారు. కృష్ణా గోదావరి నదులు, వాటి పంటకాల్వలు మురుగునీటి వల్ల కలుషితం అవుతున్నాయని సీఎం అన్నారు. శుద్ధి చేసిన తర్వాతే నీటిని కాల్వల్లోకి వదలన్నారు. ఇప్పటివరకూ చేపట్టిన పనులు, ఎక్కడెక్కడ మురునీటి శుద్ధి సదుపాయాలు ఉన్నాయి? ఎక్కడెక్కడ చేపట్టాలి? తదితర అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణతో నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. పట్టణాలు, నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో ప్రధాన నగరాలతో పాటు అన్ని మున్సిపాల్టీల్లోనూ పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు.
పారిశుద్ధ్య సిబ్బంది జీతం 50 శాతం పెంపు
వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొన్ని నెలలకే మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది జీతాన్ని 50 శాతం పెంచింది. రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంచింది. చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో వారిని ఎవ్వరూ పట్టించుకోలేదు. వారు చేస్తున్న పనులను చూసి, చలించి వారికి రూ.18 వేల జీతాన్ని అధికారంలోకి రాగానే ఇచ్చాం. ప్రజారోగ్యం కోసం వారు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. ఈ పనులను ఎవ్వరూ కూడా చేయలేరు. 2015 నుంచి 2018 సెప్టెంబరు వరకూ మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది జీతం కేవలం రూ.10 వేలు మాత్రమే. 2019 ఎన్నికలకు కేవలం 4 నెలల ముందు వారి జీతం రూ.10 వేల నుంచి రూ.12 వేలు చేశారు. అంటే ఐదేళ్లపాటు చంద్రబాబు నెలకు ఇచ్చింది కేవలం రూ.10 వేలు మాత్రమే. - సీఎం జగన్
జగనన్న హరిత నగరాలపై
ఎయిర్ పోర్టుల నుంచి నగరాలకు వెళ్లే రోడ్లను అందంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆదేశించారు. గన్నవరం నుంచి విజయవాడ, భోగాపురం నుంచి విశాఖపట్నానికి వెళ్లే రహదారులు అందంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ పనులు నగరం అందాలను మెరుగుపరిచేలా ఉండాలన్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎంపిక చేసిన రోడ్లను ఇదే రకంగా అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో కూడా స్మార్ట్‌టౌన్‌షిప్స్ ప్రారంభం కావాలన్నారు. నగరాలు, పట్టణాల్లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లను, ఆర్వోబీలను సత్వరమే పూర్తిచేయాలన్నారు. అనుమతులు మంజూరైన చోట వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
సీఆర్టీఏ పనులపై
సీఆర్డీఏ కింద పనుల ప్రగతిని సీఎం జగన్ సమీక్షించారు. కరకట్ట రోడ్డు నిర్మాణం కొనసాగుతోందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. క్వార్టర్ల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు. సీడ్‌యాక్సిస్ రోడ్లలో నాలుగు గ్యాప్స్‌ను పూర్తిచేసే పనులు మొదలవుతాయన్నారు. జులైలో కొత్తగా మహిళా మార్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 6 చోట్ల నడుపుతున్నామన్న అధికారులు... పైలెట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన మార్టులు ఎలా నడుస్తున్నాయో సమీక్ష చేస్తున్నామన్నారు.